విశాఖపట్నం, ప్రభన్యూస్ : ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మే 3న అప్పన్న నిజరూపదర్శనం ఉత్సవం నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనయాత్రగా, చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది. రెండేళ్లు తరువాత చందనోత్సవంకు భక్తులను అనుమతించడంతో ఈ ఏడాది లక్షలాది మంది భక్తులు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక ఈనెల 26న ఏకాదశిపర్వదనం సందర్భంగా అప్పన్న ఆలయంలో శాస్త్రోక్తంగా చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ రోజు తెల్లవారు జామున ప్రత్యేక పూజలు అనంతరం ఆలయ బేడా మండపంలో చందనం చెక్కలతో ప్రదక్షిణలు నిర్వహిస్తారు.
అనంతరం వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయిద్యాల నడుమ విశ్వక్షేణ, పుణ్యహవచనం, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా ఆలయ అర్చక వర్గాలు చందనం అరగదీత కార్యక్రమాన్ని ప్రారంభిస్తాయి. తొలివిడతగా అరగదీసిన చందనాన్ని స్వామి పాదాల ముందు ఉంచి ప్రత్యేక అర్చన గావిస్తారు. తొలివిడతలో మూడు మణుగుల చందనం (125 కేజీలు) సిద్ధం చేసి వాటిలో సుగంద ద్రవ్యాలు మిలితం చేసి ఆలయ బాండాగారంలో భద్రపరుస్తారు. మే 3న నిజరూపదర్శనం అనంతరం రాత్రికి వివిధరకాల ఫల, పుష్ప, శీతలాదులతో కూడిన సహస్రఘటాభిషేకం కనుల పండువుగా జరిపించి అదే రోజు రాత్రికి మూడు మణుగుల చందనాన్ని స్వామికి శాస్త్రోక్తంగా సమర్పిస్తారు. ఇందుకు సంబంధించి శనివారం ఆలయంలో చందనం చెక్కలను సిద్ధం చేశారు. సోమవారం చందనం అరగదీత వైభవంగా ప్రారంభం కానుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..