ఏపీ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. కరోనా కట్టడిలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. విజయవాడ ఏపీసీసీ భవన్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ పాల్గొన్నారు.
కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని శైలజానాథ్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలను పెంచేశారన్నారు. మోదీ పబ్లిసిటీ పిచ్చికి ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయని శైలజానాథ్ విమర్శించారు. ఉచితంగా వ్యాక్సిన్ కూడా వేయలేక పోతున్నారని.. ప్రజలపై పోటీలు పడి భారాలు పెంచుతున్నారన్నారు. పేదలకు కరోనా సమయంలో పదివేలు ఆర్థిక సహాయం ఇవ్వాలన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మోదీ బాటలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారన్నారు. ధరలను అదుపు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా ఉందని సీఎం జగన్ చెప్పడం అబద్ధమన్నారు. అవాస్తవాలను ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు.