బాధితులకు పైసా ఇవ్వలే..
వరద బాధితులకు తీవ్ర అన్యాయం చేసిన కూటమి ప్రభుత్వం
వైసీపీ నేతలు వెల్లంపల్లి, దేవినేని, మల్లాది,
తక్షణ నష్టపరిహారం చెల్లించాలంటూ నిరాహార దీక్ష
ఆంధ్రప్రభ స్మార్ట్, ఎన్టీఆర్ బ్యూరో : ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు ఆరోపించారు. కేవలం ఫొటోలకు ఫోజులు ఇచ్చారే తప్పా, బాధితులకు ఎలాంటి సాయం చేసింది లేదన్నారు. వరద బాధితులందరికీ తక్షణమే నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద వైసీపీ నేతలు నాయకులు నిరాహార దీక్షను చేపట్టారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
చంద్రబాబు వల్లే బుడమేరు వరదలు
ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు వల్లనే బుడమేరు వరదలు వచ్చాయని, మైలవరం, జగ్గయ్యపేట,జక్కంపూడి కాలని, విజయవాడ లోని సింగినగర్ తో పాటు ఇతర ప్రాంతాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. వరద సాయం కోసం బాధితులు రోజూ కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాస్తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.534 కోట్ల విరాళాలు కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైస్సార్సీపీ కోటి కాదు..కోటి 50 లక్షలు ఖర్చు పెట్టిందన్నారు. 50 వేల కుటుంబాలకు సరుకులు పంపిణీ చేసిందని వివరించారు.
వరదలంటూ వందల కోట్లు వసూలు
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలు కోసమే చంద్రబాబు ప్రయత్నం చేశాడని, వరదలను సాకుగా చూపి వందల కోట్లు వసూళ్లు చేశారన్నారు. బాధితులకు ఎంతిచ్చారో మంత్రులు చెప్పలేకపోతున్నారని,.. ఆర్టిఏ అప్ప్లే చేసుకోమంటున్నారన్నారు. కుమ్మరి పాలెం, ఊర్మిళ నగర్, హౌసింగ్ బోర్డ్ ఏరియా లో ఒక్కరికి కూడా నష్ట పరిహారం అందలేదన్నారు.
నిరాహార దీక్షలో సెంట్రల్ నియోజకవర్గ ఇంచార్జీ మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ, గౌతమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్రావు, తన్నీరు నాగేశ్వరరావు, తిరుపతి యాదవ్, సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు పాల్గొన్నారు.