Tuesday, November 26, 2024

Delhi | హజ్ యాత్ర అదనపు భారం ఏపీ భరిస్తుంది.. ఆందోళన వ‌ద్ద‌న్న అంజబ్ బాషా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికుల విమాన టికెట్ అధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఏపీ ఉపముఖ్యమంత్రి ఎస్.బి అంజద్ బాషా స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన పౌర విమానయాన శాఖ మంత్రి మంగళవారం జ్యోతిరాదిత్య సింధియాను కలిసిన అనంతరం ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో మత పెద్దలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులు విమాన టికెట్ భారం విషయంలో ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తేల్చి చెప్పారు.

విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్తే రూ. 3,88,380 ఖర్చవుతోందని సర్క్యులర్ రావడంతో హజ్ యాత్రికుల్లో ఆందోళన నెలకొందని ఆయన తెలిపారు. అదే హైదరాబాద్ నుంచి అయితే రూ. 3,05,000, బెంగళూరు నుంచి అయితే రూ. 3,04,000 ఖర్చవుతుందని వివరించారు. దీంతో తాను కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యను కలిసి ఎంబర్కేషన్ టికెట్ ధరల అంశాన్ని, ఎంబర్కేషన్ పాయింట్లను హైదరాబాద్ లేదా బెంగళూరుకు మార్చడంపై చర్చించానని తెలిపారు. ఏపీ యాత్రికులకు హైదరాబాద్, బెంగళూరు నుంచి హజ్‌కు వెళ్లే అవకాశం కల్పించాలని కోరామని ఉపముఖ్యమంత్రి వెల్లడించారు.

తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీని బుధవారం కలిసి ఏపీ హజ్ యాత్రికుల సమస్యలను వివరిస్తానని ఆయన చెప్పారు. హజ్ యాత్రికుల సమస్యను కొందరు రాజకీయం చేస్తున్నారని, హజ్ యాత్రను కూడా రాజకీయ చేయడం దారుణమని అంజద్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాష్ట్రాల హజ్ కమిటీలు,రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఉండదన్న ఆయన.. హజ్ యాత్రకు ఎంత ఖర్చు అవుతుందో కేంద్రంలో ఉండే హజ్ కమిటీ నిర్ణయిస్తుందని వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement