అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహర్థశ పట్టనుంది. వైద్య రంగంలో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టిన వైసీపీ సర్కార్ దశలవారీగా సంస్కరణలు చేపట్టింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంపూర్ణ ఆరోగ్యం ప్రతి వ్యక్తి హక్కు అనే నినాదంతో రూ. 250 కోట్లతో యూపీహెచ్‌సీల ఏర్పాటు చేసింది. అందులో వైద్య సిబ్బంది నియా మకాలు చేపట్టింది. రాష్ట్రంలో అన్ని యూపీహెచ్‌సీ లపై ప్రత్యేక దృష్టి సారించి వైద్య పరీక్షల్ని పెంచ డంతో పాటు మందుల సంఖ్యను గణనీయంగా పెంచారు. వైద్య సిబ్బందిని పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడంతో యూపీహెచ్‌సీలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయనే అభిప్రాయాలు రోగుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే రోగులకు సకాలం లో వైద్య సేవలు అందించడంతో పాటు అన్ని రకాల పరీక్షలు, వసతులపై దృష్టిసారిస్తోంది. నేషనల్ క్యాలిటీ ఎస్యూరెన్స్ (ఎన్‌క్వాస్) విధానం ప్రకారం ఆసుపత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బందితో పాటు వసతులు కల్పించాలన్నది ఈ నూతన విధానం లక్ష్యం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ వి ధానం అమలవుతుండగా తాజాగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్‌సీ)ల్లో కూడా ఈ ఎన్‌క్వాస్ విధానం అమలుకు చర్యలు చేపడుతున్నారు.
12 అంశాలపై దృష్టి
పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వసతులు మెరుగుపడటం ద్వారా రోగులకు సకాలంలో వైద్య సేవలు అందనున్నాయి. శానిటేషన్, రికార్డులు, ఐఈసీ మెటీరియల్, ఓపీ, ఐపీ, షీట్లు, ల్యాబ్, ఫార్మశీ జనర ల్ మెడిసిన్, వార్డుల్లో అందించే సేవలు, పరిపాలనా పరమైన మొత్తం 12 అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ప్రతి అంశంలో వంద మార్కుల్ని పరిగణన లోకి తీసుకుంటారు. 70 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది. ఇలా అన్ని అంశాల్లో నూటికి 70 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. కేంద్ర కమిటీ ప్రతినిధులు ఆసుపత్రుల్ని తనిఖీ చేసి మార్కులు కేటాయిస్తారు. అన్ని పారామీటర్స్ పూర్తిస్థాయిలో ఉన్న ఆసుపత్రులకు నేషనల్ క్వాలిటీ విభాగం నుంచి సర్టిఫికెట్ అందించడంతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రానికి రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదల చేయనున్నారు. రోగులకు అందించే వైద్య సేవలు, వైద్యల పనితీరు, మందుల పంపిణీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని మార్కులు కేటాయించనున్నారు.
మొదలైన ఆసుపత్రుల ఎంపిక
నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ పథకానికి సంబంధించి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఎంపిక ప్రక్రియను జిల్లాస్థాయి ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించారు. తొలి విడతలో జిల్లాకు 10 నుంచి 14 యూపీహెచ్‌సీలను గుర్తించి పూర్తిస్థాయిలో అన్ని వసతులు కల్పించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. కేంద్ర క్వాలిటీ విభాగం పట్టణ ఆరోగ్య కేంద్రాలకు అందించే నిధుల్ని వినియోగించుకోవడం ద్వారా ఆయా ఆసుపత్రుల్లో వసతుల్ని మెరుగుపర్చడం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. ప్రతి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ సర్టిఫికెట్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించి ఆ మేరకు కసరత్తు మొదలెట్టారు. ఇందులో భాగంగా యూపీహెచ్‌సీ ల్లోని వైద్యులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు.
చిరునవ్వుతో ఇంటికి వెళ్ళేలా
రోగి ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ఇంటికి వెళ్లేవరకూ పూర్తి ఆరోగ్యంతో, సంతోషంతో, తాను మంచి సేవలు పొందానన్న సంతృప్తితో వెళ్లేలా చేసేలా ప్రభుత్వం ఆసుపత్రుల్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పారిశుద్ధ్యం పై ప్రధానంగా దృష్టిసారించింది. పారిశుద్ధ్యం, పరిపాలన, ఆస్పత్రుల నిర్వహణ, ఇవన్నీ సరిగా అమలవుతున్నదీ, లేనిదీ పర్యవేక్షించేందుకు తనిఖీల సంఖ్య పెంచనుంది. తరచూ తనిఖీల ద్వారా ఆస్పత్రుల పనితీరును మెరుగుపర్చాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 987 కేంద్రాల్లో రెన్నోవేషన్ పనుల్ని రూ.440 కోట్లు తో చేపట్టింది. ఎంఎల్‌హెచ్‌పీ నియామకాలు చేపట్టి గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఎన్‌క్వాస్ విధానాలకు అనుగుణంగా తాజాగా పట్టణ ఆరోగ్య కేంద్రాలకు మెరుగులుదిద్దనుంది.