అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మరోసారి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నేతలపై వైసీపీ నేతలు బనాయించిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అక్రమ కేసులను ఎత్తివేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
అటు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్పడిన చర్యలు పోలీసులకు కనిపించడం లేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎన్నికల్లో తమ పార్టీ నేతలు అడ్డుకున్నది పోలీసుల విధులను కాదని.. వైసీపీ రిగ్గింగ్‌ను అని స్పష్టం చేశారు. వైసీపీకి అక్రమ కేసులు పెట్టడం అలవాటుగా మారిందని.. ఎన్నికలు ముగిశాక కూడా టీడీపీ నేతలపై వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.