వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న చేపట్టనున్న భారత్ బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ ఉక్కు పోరాట వేదిక, రైతు సంఘాలు తలపెట్టిన ఈ బంద్‌లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో టీడీపీ వెనకంజ వేయదని స్పష్టం చేశారు.
సీఎం జగన్ సహకారంతోనే పోస్కోతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. ఉక్కు ప్రైవేటీకరణకు పార్లమెంటు సాక్షిగా కేంద్రం అడుగులు వేస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్, కార్మికుల జీవితాలపై వైసీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాజీనామాలు చేసి పోరాటానికి రావాలని డిమాండ్ చేశారు. చీకటి ఎజెండాతో కార్మికులను రోడ్డున పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి గర్వకారణమైన విశాఖ ఉక్కును కాపాడాల్సిన బాధ్యత సీఎం జగన్ పై లేదా ? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇంకా రిలే దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేపట్టిన దీక్షలు నేటితో 40వ రోజుకు చేరుకున్నాయి. ఈ నెల 28న అఖిల భారత కిసాన్ మోర్చా నేతలతో భారీ సభ నిర్వహించనున్నారు.