Thursday, November 21, 2024

AP | దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు.. బాలల హక్కుల కమిషన్‌ ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థలకు రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించిన దసరా పండుగ సెలవులను విధిగా పాటించి తీరాలని కమిషన్‌ చైర్‌పర్సన్‌ కేసలి అప్పారావు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఖచ్చితంగా చర్యలుంటాయని స్పష్టం చేస్తూ అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

ఈ దసరా సెలవుల్లో విద్యా సంస్థలు తరగతులు నిర్వహించినా లేదా ఆ్లనన్‌ తరగతులు నిర్వహించినా తప్పక ఆయా పాఠశాలలుపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొన్ని జిల్లాలలో సెలవులు విషయములో ప్రభుత్వ నియమ నిబంధనలును కొన్ని ప్రైవేట్‌ కార్పోరేట్‌ పాఠశాలలు పాటించడం లేదని కమిషన్‌ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నారని, మరికొన్ని విద్యా సంస్థలు మొబైల్‌ ఫోన్‌ ద్వారా హోం వర్క్‌ చేయమని పిల్లలను ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఫిర్యాదులున్నాయని పేర్కొన్నారు. ఎక్కడైనా పాఠశాలలు ప్రత్యేక తరగతులు, ఆన్‌లైన్‌ తరగతులు, ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తే రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌కు మెయిల్‌ ద్వారా పిర్యాదు చేయాలని సూచించారు.

అలాగే మండల, జిల్లా స్థాయి విద్యా శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలను గుర్తించి తగు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఈమేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement