Monday, November 25, 2024

Delhi | గణతంత్ర దినోత్సవాలకు శకటాలు సిద్ధం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల శకటాలు సిద్ధమవుతున్నాయి. మరో నాలుగు రోజుల్లో జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీలోని రక్షణ శాఖకు చెందిన రంగ్‌శాల మైదానంలో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. సోమవారం ఈ శకటాలను రక్షణ శాఖ మీడియాకు ప్రదర్శించింది. ఈ ఏడాది 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ పలు శాఖల శకటాల ప్రదర్శనకు ఎంపికైనట్టు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.

రక్షణ శాఖకు చెందిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు స్పెషల్ ఫోర్సెస్, పారామిలటరీ బలగాలు, ఇతర సాయుధ బలగాలు ప్రతియేటా ప్రదర్శనలో భాగంగా ఉంటాయి. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు “ప్రజాస్వామ్య మట్టి  పరిమళాలు – జన సామాన్య ప్రజాస్వామ్య యోధులు” థీమ్‌తో తెలంగాణ శకటం తయారవుతుండగా…  “ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యను మార్చడం – విద్యార్థులను ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా చేయడం” ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రదర్శనకు ముస్తాబవుతోంది.

ఆంధ్రప్రదేశ్ శకటం

ఈనెల 26వ తేదీన కర్తవ్య్‌పథ్‌లో వికసిత్ భారత్ థీమ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన వివిధ సంస్కరణలకు అద్దం పట్టేలా విద్యా రంగం సంస్కరణలతో శకటాన్ని రూపొందించారు. ఇప్పటికే రాష్ట్రంలో 62 వేల డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల‌ నుంచి బోధన అందిచడం ద్వారా దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కొత్త చరిత్ర సృష్టించింది. ‘మనబడి నాడు-నేడు’ కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ ల్యాబ్, ఫర్నీచర్, గ్రీన్ చాక్ బోర్డులు, స్మార్ట్ టీవీ, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, ప్లే గ్రౌండ్ తదితర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తోంది.

ఇవన్నీ ప్రతిబింబించేలా శకటంలో ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులు కనీస ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. దాంతో పాటు టెక్నాలజీ ఆధారిత విద్యా ప్రమాణాలతో ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆధునిక డిజిటల్ పాఠశాలల స్థాయిలో బోధన వంటి విషయాలతో ఏపీ శకటానికి రూపకల్పన చేయడమే కాకుండా 55 సెకండ్ల నిడివి గల థీమ్ సాంగ్‌ను రూపొందించి ప్రదర్శనకు సిద్దమైనట్లు ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement