అమరావతి – సంక్రాంతి శోభతో తెలుగు వారి లోగిళ్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారు సంక్రాంతి వేడుకల కోసం స్వస్థలాలకు వస్తున్నారు. ముఖ్యంగా, పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో నేడు మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన సూచన పట్ల ఆయన వెంటనే స్పందించి పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సులు సరిపోకపోతే ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలకు చెందిన బస్సులను కూడా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన బస్సుల సాయంతో ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేయాలని నిర్దేశించారు. అయితే, ఫిట్ నెస్ ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులను పంపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నడిపి ప్రజలకు ప్రయాణ కష్టాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు.