నేడు జరిగిన ఎన్నికలు
మొత్తం అన్ని స్థానాలు కూటమి కైవసం
బలంలో లేకపోయిన బరిలో వైసిపి
చివరి నిమిషంలో ఓటింగ్ బాయ్ కాట్
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) కొత్త ఛైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. పీఏసీ సభ్యులుగా శ్రీరామ్ రాజ్ గోపాల్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలితకుమారి, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు.
ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై ఎమ్మెల్యేలు వారి ఓట్లు వేశారు. ఇక అసెంబ్లీ ఆర్థిక కమిటీలో ఏదైనా పార్టీ నుంచి ఒక సభ్యుడు ఎన్నికవ్వాలంటే ఆ పార్టీకి శాసనసభలో ఉండాల్సిన కనీస సంఖ్యా బలం 18. అయితే, కేవలం 11 మంది సభ్యుల సంఖ్యా బలంతో మూడు కమిటీలకు ముగ్గురు వైసీపీ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో 9కి గాను మొత్తం 10 చొప్పున నామినేషన్లు దాఖలు అవటంతో పోలింగ్ అనివార్యమైంది.
ఏపీ పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించి పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా పీఏసీ కమిటీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ కూడా కమిటీ సభ్యులకు సంబంధించి ఎన్నికలు జరగలేదు. మొదటి సారిగా పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని అధికారపక్షం దక్కించుకోవడం అనేది ప్రధాన అంశంగా చూడొచ్చు. పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, తొలిసారి అనూహ్యంగా పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చేందుకు అధికారపక్షం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది.
సంఖ్యా బలం లేకపోయినా వైసీపీ తరుపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేశారు. గెలవడానికి తగిన సంఖ్యలో ఓట్లు లేనందున పెద్దిరెడ్డి ఓడిపోయారు. ఎన్డీయే కూటమికి చెందిన 9 మంది అభ్యర్థులు కూడా గెలిచారు. వీరిలో ఏడుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, ఒకరు జనసేన, మరొకరు బీజేపీకి చెందిన వారున్నారు. ఎన్డీయే కూటమిలో అధికార పక్షంలో ఉన్న జనసేన నేత పులపర్తి రామాంజనేయులును పీఏసీ ఛైర్మన్ గా ఎన్నుకున్నారు.
పీఏసీ కమిటీ ఛైర్మన్ పదవి అత్యంత కీలకమైనది. ఎక్కడైనా అవినీతి, అక్రమాలు జరిగినా.. ఛైర్మన్ గా వాటిని పరిశీలించే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని ప్రతిపక్షం వైసీపీ కోల్పోయిందని చెప్పొచ్చు. పారదర్శకంగా ఉండాలనే లక్ష్యంతో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే అమలవుతోంది. అయితే, ఏపీలో తొలిసారి పీఏసీ ఛైర్మన్ పదవిని అధికారపక్షమే దక్కించుకుంది.