Sunday, November 24, 2024

AP – “ప్రజా వేదన” డాక్యుమెంటరీ పై స్పందించిన పవన్ – సమస్యల పరిష్కారానికి ఆదేశం

ఆమరావతి – “ప్రజా వేదన” పేరుతో విజయనగరం, పార్వతీపురం, చీపురుపల్లి మరియు గజపతినగరం నియోజకవర్గాల ప్రజా సమస్యలను డాక్యుమెంటరీ రూపంలో పంపిన వీడియో పై ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు .

విజయనగరం, పార్వతీపురం, చీపురుపల్లి , గజపతినగరం నియోజకవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టిలో ఉన్నాయనీ, వాటిని క్రమ పద్ధతిలో పరిష్క రిస్తానని హామీ ఇచ్చారు.

ఈ మేరకు ఆయన ఎక్స్ ఖాతా లో ట్వీట్ చేసారు.

అందులో ముఖ్యంగా కాలుష్యం, రక్షిత మంచినీరు అందకపోవడం, పారిశుద్ధ్యం మరియు వైద్య సదుపాయాల విషయంలో, విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనే దృఢ సంకల్పంతో ఉన్నాము. కచ్చితంగా వీటిపై ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తాము.

ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులను ఈ సమస్యల పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేసి, వాటిని త్వరితగతిన పరిష్కరించే దిశగా పనిచేయాలని ఆదేశించడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం కచ్చితంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో, మాట నిలబెట్టుకునే విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తామని తెలియజేస్తున్నాను.

- Advertisement -

“ప్రజా వేదన” పేరుతో ప్రజా సమస్యలను డాక్యుమెంటరీ రూపంలో ముందుకు తీసుకొచ్చిన యువకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ప్రయత్నం చాలా అమూల్యమైనది, ఇదేవిధంగా మీరు మరింత బలంగా పనిచేయాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ పేర్కొన్నారు.

కాకినాడ జిల్లాలో కాలువల మరమ్మతులకు నిధులు

కాకినాడ జిల్లాలోని రైతాంగానికి సాగునీటి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసేందుకు సాగు నీటి కాలువలకు అవసరమైన మరమ్మతుల విషయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపించారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరయ్యాయి. రానున్న రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకొంటున్నారు. సాగునీటి కాలువల మరమ్మతులు, పూడికతీత, ఇతర మైనర్ పనులను చేపడతారు.

2023లో వచ్చిన మిచాంగ్ తుపాను ప్రభావానికి కాకినాడ జిల్లాలో పలు సాగునీటి కాలువలు, కట్టలు, గేట్లు, పూడికతీత వంటి సమస్యలు ఏర్పడ్డాయి. తుపాను తగ్గిన వెంటనే ఈ నష్టానికి సంబంధించి జిల్లా అధికారులు 288 ఇరిగేషన్ పనులు వెంటనే చేయాలని ప్రతిపాదనలు అప్పటి ప్రభుత్వానికి పంపారు. అయితే నాటి ప్రభుత్వం ఆ పనులను కనీసం పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది.

తాజాగా ఏలేరు రిజర్వాయర్ కు వరద వచ్చినపుడు బాధిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పర్యటన జరిపినప్పుడు సాగు నీటి పనులకు సంబంధించిన గతంలో పంపిన ప్రతిపాదనలను అధికారులు తెలియజేయడంతో వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి జలవనరుల శాఖ అధికారులతో దీనిపై చర్చించి అత్యవసరం చేయాల్సిన 39 పనులను గుర్తించారు.

వీటికి సంబంధించి రూ.8.97 కోట్ల నిధుల పరిపాలన అనుమతులు లభించాయి. జలవనరుల శాఖ ద్వారా టెండరు నోటీసు వెంటనే ఇచ్చేలా చూడాలని, 2 నెలల్లోగా పనులు పూర్తయ్యేలా చూడాలని జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు.

కాకినాడ రూరల్, ముమ్మిడివరం, పెద్దాపురం, పిఠాపురం, ప్రత్తిపాడు, రామచంద్రపురం నియోజకవర్గాల్లో గుర్తించిన సాగు నీటి పనులు వెంటనే జరగనున్నాయి.

.ఏలేరు రిజర్వాయర్ వరదల పనుల గుర్తింప ఇటీవల వచ్చిన ఏలేరు వరదల్లో నష్టం జరిగిన సాగునీటి పనులను సైతం వెంటనే పూర్తి చేయాలని జిల్లా అధికారులను పవన్ ఆదేశించారు. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన ఏలేరు వరదలకు కొన్ని చోట్ల కాలువల గట్లు బలహీనం అయ్యాయి. పూడికతీతలు చేయాల్సి ఉంది. అలాగే మరికొన్ని మైనర్ మరమ్మతులు చేయాల్సిన తరుణంలో మొత్తం 87 పనులను దీనిలో గుర్తించారు. దీనికి రూ.5.97 కోట్ల మేర నిధులు అవసరం అవుతాయి. ఈ నిధులను కొన్ని జిల్లా కలెక్టర్ నిధుల నుంచి, మరికొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుంచి సర్దుబాటు చేసి వెంటనే పనులకు టెండర్లు పిలవాలని ఆదేశించారు. పనులు వెంటనే పూర్తయ్యేలా చొరవ తీసుకోవాలని, వచ్చే పంటకాలం నాటికి రైతాంగానికి ఇబ్బంది లేకుండా సాగునీటి సరఫరా సాగేలా చూడాలన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement