Friday, November 22, 2024

AP – ఉపాధి అక్రమార్కులపై చర్యలు తథ్యం – పవన్ కల్యాణ్

రూ. 13000 కోట్లు దారి మ‌ళ్లాయ్​
జాబ్ కార్డుల జారీపైనా లోతుగా విచారణ జరిపిస్తాం
వ్యవసాయాన్ని ఉపాధితో అనుసంధానం చేస్తాం
శ్మశానవాటిక పనులనూ అందులోనే చేపడుతాం
కాలువల్లో తూడు కూడా ఉపాధిహామీలోనే చేయొచ్చు
అసెంబ్లీలో స్ప‌ష్టం చేసిన ఉప‌ముఖ్య‌మంత్రి పవన్

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :

ఉపాధి హామీ పథకం పనులను గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని, ఆ నిధులను పెద్ద మొత్తంలో దారి మళ్లించారని ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. జాబ్ కార్డుల జారీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు. ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలు, నిర్లక్ష్య ధోరణిపై శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ప‌లు ప్రశ్నలకు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌ సమాధానం ఇచ్చారు. ఉపాధి పథకం అనేది డిమాండ్ ఆధారిత పథకమన్నారు. నైపుణ్యం లేని మ్యానువల్ పనిని చేయడానికి కూలీనాలీ జనానికి 100 రోజలు పని కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పని కోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు ఇస్తున్నామని, 100 రోజులు పని కల్పించని స్థితిలో 15 రోజులు వేతనం పరిహారం చెల్లిస్తున్నామన్నారు. జాబ్ కార్డుల జారీలో జరిగిన అవకతవకలపై తప్పని సరిగా చర్యలు తీసుకుంటామన్నారు.

అక్రమార్కుల‌పై చర్యలు తప్పవు..

అసెంబ్లీలో సభ్యలు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నామని ఉప ముఖ్య‌మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. 4500 కోట్ల రూపాయలు వేజ్, మెటీరియల్ కాంపౌండ్‌తో నిధులు వచ్చాయన్నారు. జగన్ ప్రభుత్వం ₹13వేల కోట్లు దారి మళ్లించిందని.. ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులను ఉపాధిహామీతో అనుసంధానం చేస్తామన్నారు. కాలువల్లో తూడు తొలగింపు పనులను డిస్ట్రిబూటర్ కమిటీలు చేపడుతాయని, కానీ తూడు తొలగింపు పనులు అత్యవసరమైతే స్థానిక ఎమ్మెల్యే కోరితే ఆ పనులు చేపట్టవచ్చన్నారు. ఇక శ్మాశాన వాటికల్లో పనులను ఉపాధిహామీతో అనుసంధానం చేస్తామన్నారు. పాఠశాలల కాంపౌండ్ వాల్ నిర్మాణాల తర్వాత శ్మశాన వాటికలకూ ప్రహరీ గోడలు నిర్మించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉన్నామని, తాగునీరు, వైద్యం తప్పనిసరిగా ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -

సర్వనాశనం చేశారన్న ఎమ్మెల్యే ఆనందరావు

గ్రామీణ ప్రాంతంలో పేదల ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే పథకం ఇదని తెలుగుదేశం అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. 70 నుంచి 80శాతం జాబ్ కార్డులున్నవారికి 100 రోజుల పనిని కల్పించాలని చెప్పారు. 10 శాతం దాటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 100 రోజులు పని లభించలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ఆర్జీఈఏస్‌ను సర్వనాశనం చేశారని ఆరోపించారు. చివరకు దీనికి సంబంధించిన వెబ్‌సైట్లను కూడా మూసివేశారని మండిపడ్డారు. అరటి, కొబ్బరి, కొకొ, వక్కకు ఇస్తే పనిదినాలు పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. గుర్రపుడెక్క తీసుకునే అవకాశం ఇస్తే పనిదినాలు పెరుగుతాయని ఆనందరావు చెప్పారు.

స్కూల్​ పిల్లలకూ.. జైలు ఖైదీలకూ..

గత ప్రభుత్వం రాజకీయ కక్షతో ఉపాధి హామీ పనులను దెబ్బతీసిందని చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ శాఖ 22 శాఖలను ఉపాధి హామీ పనులతో అనుసంధానం చేస్తే.. పని పూర్తి చేసినోళ్లకు బిల్లులు చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ₹351 కోట్లు చెల్లించారని, కానీ ఇప్పటికే 50 మంది ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. శ్మశాన వాటిక పనులను ఉపాధి హామీ పనులను కలపాలని కోరారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య మాట్లాడుతూ, ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. కాలేజీకి వెళ్లి పిల్లలకు, జైళ్లల్లో ఖైదీలకూ జాబ్ కార్డులు ఇచ్చారని.. జాబ్ కార్డుల జారీలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement