పిఠాపురం – రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. పిఠాపురం పర్యటనలో భాగంగా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అత్యాచార ఘటనలకు హోంమంత్రి అనిత బాధత్యాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. ఆడపిల్లపై అత్యాచారం జరిగితే కులం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తాను హోంమంత్రి అయితే పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరించారు. విమర్శలు చేస్తున్నవారిని ఇలానే వదిలేస్తే తానే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకం అని చెప్పారు. పోలీసులు పదేపదే తమతో చెప్పించుకోవద్దని అన్నారు.
తమది ప్రతీకార ప్రభుత్వం కాదని అలా అని చేతకాని ప్రభుత్వం కూడా కాదని చెప్పారు. గత ప్రభుత్వం తీరువల్లే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చిందని అన్నారు. ఆ రోజున సీఎం సతీమణినే అసెంబ్లీలో దూషించారని గుర్తు చేశారు. తన ఇంట్లో వాళ్లను సైతం దూషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోజు డీజీపీ కానీ ఇతర అధికారులు కూడా ఒక్కసారి మాట్లాడలేదన్నారు. తనను కూడా చంపేస్తామని బహిరంగంగా చెప్పారని వ్యాఖ్యానించారు. రక్షణ కలిగిన తననే హెచ్చరించినప్పుడు రోడ్డునపోయే వారి పరిస్థితి ఎలా ఉంటుందన్నారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుండి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టాలని పోలీసు అధికారులకు చెబుతున్నామని అన్నారు. కానీ అధికారులకు ఆ అలవాటే పోయిందన్నారు. అరెస్ట్ చేయాలంటే కులం గురించి మాట్లాడుతున్నారని, ఐపీఎస్ లు కదా మీరు చదువుకుంది అన్నారు. మూడేళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేస్తే కులం ఎందుకు వస్తుందని అన్నారు. క్రిమినల్స్ ను కులం పేరుతో వెనకేసుకురావాలని చట్టాలు చెబుతున్నాయా? అని మండిపడ్డారు. నేరస్థులకు అసలు కులమే ఉండదని మండిపడ్డారు.