Thursday, September 12, 2024

AP – ట్యాక్స్ పేయ‌ర్సే దేవుళ్లు .. ఇక మందుబాబులకు పండుగే…

ఏపీ సర్కారు కొత్త నైవేద్యం
కారు చౌకగా మేలిమి బ్రాండ్లు
నూతన పాలసీకి రెడీ
సీఎం చంద్ర‌బాబు ఆదేశమే ఆలస్యం

చేతిలో పైసా లేదు. అప్పులు దొరకవు. పాత అప్పుల వడ్డీలకే సంపాదన సరి. ఇదీ ఏపీ సర్కారు దైన్య స్థితి. ఉద్యోగులకు జీతాలివ్వాలి. పెన్షన్లు ఇవ్వాలి. సూపర్ సిక్స్ కు సూపర్ పొటాషే బలం. ఇక ఉన్నది ఒకటే దారి. ట్యాక్స్ పెయిర్సే ఆపద్బంధావులు. మందుబాబులే లేకుంటే పరిసాలనే ఉండదంటే ఆశ్చర్యం కాదు. ఇదే పచ్చి నిజం. ఇప్పటికే గత ప్రభుత్వం పుణ్యమా? అని చీప్ లిక్కర్‌నే స్కాచ్ ధరకు అంటగట్టారు. అందినంత పిండుకున్నారు. మద్యం పుత్రులు మాత్రం అనారోగ్యంతో బక్కచిక్కిపోయారు. ఆడోళ్ల పసుపు తాళ్లు తెగాయి. ఇక తాజా ప్రభుత్వమూ తాగనోడెందుకు ఈ లోకంలో అనే రీతిలో.. మద్యం ఆదాయం కోసం కొత్త తాయిలాలను రెడీ చేస్తోంది. కారు చౌక.. నాణ్యమైన లిక్కరు నినాదంతో ఏపీలో కొత్త మద్యం పాలసీ తెరమీదకు వస్తోంది. దీనికి కారణం.. తక్షణమే గల్లాపెట్టె నిండాలి.

- Advertisement -

( ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్ వర్క్)
ఏపీలో కొత్త మద్యం పాలసీ కసరత్తులు తుది దశకు చేరుకున్నాయి. ఎన్నికల్లో లిక్కర్ ధీరులను ఆకట్టుకునే రీతిలో ఇచ్చిన హామీలను నెరవేర్చి.. ప్రభుత్వ ఖజానాను నింపే క్రతువును ప్రారంభించింది. మరో ఇరవై రోజుల్లో .. మన మందు బాబులు ఇష్టమైన బ్రాండ్ల బ్రాందీ, విస్కీ, రమ్మును గటగటా గుటకేసే రీతిలో కొత్త పాలసీ దాదాపు ఖరారైంది. మద్యం ప్రియులకు అత్యంత ప్రీతిపాత్రమైన బ్రాండెడ్ కంపెనీల లిక్కర్ ను అందుబాటులోకి ప్రభుత్వం తీసుకు వస్తోంది. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులతోనూ చర్చలు జరిగాయి. ధరల పైన.. కొత్త ఫార్ములా పైన నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో మద్యం దుకాణాలను ప్రయివేటు వ్యక్తులకే అప్పగించనుంది.

లిక్కరే ఖజానాకు ఆధారం

సంపద సృష్టికి ఉత్పత్తే ఆధారం. ఉత్పత్తికి పెట్టుబడి, శ్రమే మూలం. ప్రస్తుతం ప్రభుత్వం ఏకైక ఎజెండా సంప‌ద సృష్టి. జనానికి పంపిణీ. కానీ ఇక్కడ పెట్టుబడి లేదు. ఏం చేయాలి? ఖజానా నింపటానికి ఏకైక మార్గం లిక్కర్ వ్యాపారం. ఈ వ్యాపారాన్ని గత ప్రభుత్వం నేరుగా నిర్వహించింది. 2019 -20లో రూ.17,473.25 కోట్ల లిక్కర్ ఆదాయాన్ని 2022-23 నాటికి రూ.23,785.32 కోట్లకు పెంచింది. 2023..24 నాటికి ఈ ఆదాయం రూ.26 వేల కోట్లకు చేరిందని అనధికార సమాచారం. 2019-20లో రూ.17,473.25 కోట్ల లిక్కర్ ఆదాయం 2020 -21లో రూ.17,890.01 కోట్లకు పెరిగింది. ఈ వ్యత్యాసం చాలా స్వల్పమే. కానీ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, ఎక్సైజ్ ఆదాయం రూ. 21,432.31 కోట్లకు పెరిగింది . 2022 -23లో రూ. 23,785.32 కోట్లకు చేరుకుంది. అంటే… ఎక్సైజ్ ఆదాయం పెరగబట్టే అత్యవసర ఖర్చులకు ప్రభుత్వం వినియోగించింది. ఇక తాజా ప్రభుత్వం పరిస్థితి తట్టుకోలేనిది. ఇటు సూపర్ సిక్స్ పథకాల కోసం రీ షెడ్యూల్ పేరుతో మళ్లీ అప్పుల కోసం తిప్పలు పడుతుంటే.. ఇక ఏకంగా ప్ర‌కృతి విరుచుకుపడింది. ఈ పేరుతో సూపర్ సిక్స్ కు సెలవు ఇద్దామనుకుంటే.. వరద బాధితులకు పరిహారం చెల్లించాలి. కేంద్రం ఇచ్చే నిధులతో గట్టెక్కుదామనుకుంటే… ఎంత వరకు సాధ్యమో అర్థం కాని స్థితి.

మద్యం పాలసీతోనే ఉపశమనం
అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. అక్టోబర్ 3 నుంచి వైన్ షాపులు, బార్లల్లో సరికొత్త సంబరాలు జరగనున్నాయి. ఫ్రీ టచ్చింగ్… వన్ ప్లస్ త్రీ ఆఫర్లు రానున్నాయి. ఇప్పటికే ఈ పాలసీ రూపకల్ప‌నకు అన్ని అంశాలను ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేసింది. ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీలు ఏ విధంగా ఉన్నాయి.. ఆ పాలసీ వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి.. ప్రయోజనాలు ఏమిటి.. ఇలా అన్నింటిపైనా ఫోకస్ పెట్టింది. ఇకపై కొత్త ఎక్సైజ్ విధానంలో ప్రయివేటు వ్యక్తులకు పాత పద్ధతి వేలంలోనే మద్యం దుకాణాలను అప్పగిస్తుంది. ఇప్పటికే పాలసీ పైన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ పలు అంశాలపై చర్చించింది.

కారు చౌకగా మేలిమి బ్రాండ్లు
ధరలు అమ్మకాలపై బ్రాంది, విస్కీ, బీరుల్లో పాత బ్రాండ్లను తిరిగి ఏపీలో విక్రయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అన్ని నాణ్యమైన బ్రాండ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటుంది. తక్కువ ధరకు మద్యం అమ్మకాలు చేయడంతో పాటు ఆదాయాన్ని పెంచుకునేలా కొత్త ఎక్సైజ్ పాలసీలో కసరత్తును ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. అయిదేళ్ల కాలంలో అందుబాటులో లేకుండా పోయిన ప్రముఖ బ్రాండ్ల మద్యం ఏపీలో తిరిగి అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ఎంఎన్‌సీ బాండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని మంత్రివర్గం ఓ నిర్ణయానికి వచ్చింది. తక్కువ ధర కేటగిరిలో క్వార్టర్ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90 లకే అందించాలని ప్రణాళికలు రచిస్తోంది. వీటిన్నింటినీ పరిశీలించి నూతన మద్యం విధానాన్ని మంత్రివర్గ ఉపసంఘం రూపొందించనుంది. మద్యం విషయంలో అక్రమాలకు తావులేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం..అమ్మకాల్లో మెరుగైన విధానం పైన కసరత్తు తుది దశకు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement