Friday, November 22, 2024

Municipal Elections Results: ఏపీలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు షురూ

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 23 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలకు ఈ నెల 15న పోలింగ్ జరిగింది. నెల్లూరు కార్పొరేషన్‌ సహా 13 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు మరో 10 మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న డివిజన్లు, వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించిన అనంతరం సాధారణ ఓట్లు లెక్కిస్తారు. 23 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్లు లెక్కించడానికి 450 టేబుళ్లు ఏర్పాటుచేశారు. కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా 534 మందిని, అసిస్టెంట్‌ కౌంటింగ్‌ సూపర్‌వైజర్లుగా 3,792 మందిని నియమించారు. సాయంత్రం 5 గంటలలోపు అన్ని మున్సిపాలిటీల్లో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

మొత్తం 325 స్థానాలకు 1,206 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సోమవారం(నవంబర్ 15) జరిగిన పోలింగ్‌లో 8,62,066 మందికిగాను 5,14,086 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో 54 డివిజన్‌లు ఉండగా 8 డివిజన్‌లు ఏకగ్రీవమైయ్యాయి. మిగిలిన 46 డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా డివిజన్లలో పోలైన ఓట్లు లెక్కించడానికి 142 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇక, కుప్పంలో 24 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement