న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అన్నపూర్ణగా వెలుగొందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అరాచప్రదేశ్‌గా మారిపోయిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. విశాఖ ఎంపీ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం వందల కోట్ల భూముల అంశమని భానుప్రకాష్ ఆరోపించారు. ఎంపీ నివాసంలో జరిగిన ఘటనపై జ్యుడిషల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం అత్యధికంగా గంజాయి స్మగ్లింగ్ అవుతున్న రాష్ట్రం ఏపీయేనని, ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా అని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
హోంమంత్రి ఎన్నిసార్లు రివ్యూ సమావేశాలు పెట్టారో చెప్పాలన్నారు. ఏపీలో మంత్రులు ఉత్సవ విగ్రహాల్లా మారారని విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఎంపీ నివాసంలో జరిగిన ఘటనను బట్టే అర్థమవుతోందన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ అరాచకంగా మారిపోయిందని ప్రజలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు గుండెలపై చెయ్యి వేసుకొని ప్రశాంతంగా పడుకునే రోజు వస్తుందా అని భానుప్రకాష్ ప్రశ్నించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉందని, ఆయన తన నివాసం వదిలి బయటకు రావాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో సీఎం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఎమ్మెల్సీ తన మాజీ డ్రైవర్‌ను చంపితే కనీసం విచారణ చేయలేదని, బాలుణ్ని చంపినా పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. ఏపీలో ఐపీసి రూల్ బదులు వైసీపీ రూల్స్ అమలవుతున్నాయని ధ్వజమెత్తారు. యూపీలో రౌడీలంతా బెయిల్ రద్దు చేసుకోని జైల్లో ఉంటే ఏపీలో మాత్రం రౌడీలు ఎంపీల ఇళ్లలో ఉంటున్నారని భానుప్రకాష్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.