వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..
తెల్లవారుజామునే నదీ స్నానాలు…
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు…
భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు…
దేదీప్యమానంగా దేవాలయాలు..
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) పరమశివునికి అత్యంత ప్రతిపాదమైన కార్తీక మాసంలోని పౌర్ణమి వేల భక్తి వెన్నెల విరబూస్తోంది. కార్తీక మాసంలో నీ కృత్తికా నక్షత్రం రోజున వచ్చిన పౌర్ణమి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. తెల్లవారుజామునే నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించడంతోపాటు మహిళలు దీపాలు వెలిగించి కృష్ణమ్మకు హారతులు పడుతున్నారు. పౌర్ణమి ఘడియలు ప్రారంభమైన నాటి నుండే ఆలయాలకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న భక్తులు శివయ్యకు ప్రత్యేక పూజలు బిల్వార్చనలు, సహస్ర లింగార్చనలతో పాటు అభిషేకాలను నిర్వహిస్తున్నారు. ఓం నమశ్శివాయ అనే నామస్మరణతో ఆలయాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి.
జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న కనకదుర్గమ్మ వారితో పాటు మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దుర్గా ఘాట్ వద్ద పుణ్యా స్నానాలు ఆచరించి, భక్తిశ్రద్ధలతో దీపాలను నదిలో విడిచి పెడుతున్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మల్లేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలను అభిషేకాలను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలలో భక్తుల రాకతో కిటకిటలాడుతున్నాయి.
వైభవంగా ఆది దంపతుల గిరిప్రదక్షిణ..
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదిదంపతుల గిరిప్రదక్షిణను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో ఆదిదంపతుల ఉత్సవ విగ్రహాలకు కామధేను ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. ఇంద్రకీలాద్రి చుట్టూ సుమారు 6 కిలోమీటర్ల మేర జరిగిన ఈ గిరిప్రదక్షణలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.