వెలగపూడి – ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు కొత్త సంవత్సరం ప్రారంభం వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీపీఎస్సీ ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ ను ఈ నెల 12 విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. 866 పోస్టులకు సంబంధించి మొత్తం 18 నోటిఫికేషన్లు విడుదల చేయనుంది, కాగా, అటవీ శాఖలోనే 814 పోస్టులు భర్తీ చేయనుంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ పైన కమిషన్ ఏర్పాటు చేయటంతో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు జారీ చేసేలా కసరత్తు చేస్తున్నారు.
పలు కేటగిరీల కోసం ఏపీపీఎస్సీ విడుదల చేయనున్న నోటిఫికేషన్ లో పలు కేటగిరీల పోస్టుల భర్తీకి సంబంధించి స్పష్టత ఇవ్వనున్నారు. ప్రధానంగా బీసీ వెల్ఫేర్‌లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, దివ్యాంగుల సంక్షేమశాఖలో వార్డెన్, గనుల శాఖ- రాయల్టీ ఇన్‌స్పెక్టర్, ఫ్యాక్టరీ సర్వీసెస్‌లో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జైళ్లశాఖలో జూనియర్ అసిస్టెంట్-టైపిస్టు, రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక, ఇదే సమయంలో గ్రూప్-1 11/2023 నోటిఫికేషన్ మెయిన్ ఎగ్జామ్స్ ఏప్రిల్ తర్వాత నిర్వహించే అంశం పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. గ్రూపు -2 మెయిన్స్ పరీక్ష ను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించనున్నారు. అదే విధంగా.. జూన్‌లో పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ భర్తీ కోసం రాత పరీక్ష లను నిర్వహించేలా కసరత్తు కొనసాగుతోంది. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టులకు సంబంధించి జూన్ నుంచి పరీక్షలు జరిపేలా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో పాఠశాల విద్యాశాఖ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, పర్యావరణ శాఖలో ఎనలిస్టు గ్రేడ్-2, ఎన్టీఆర్ వర్సిటీ అసిస్టెంట్ లైబ్రేరియన్ తో పాటుగా పలు పోస్టులు ఉన్నాయి. ఇక జాబ్ క్యాలండర్ లో ఈ ఏడాదిలో భర్తీ చేయబోయే ఉద్యోగులతో పాటు వాటి నోటిపికేషన్ తేదీలను కూడా పొందుపరచనున్నారు.