అమరావతి, ఆంధ్రప్రభ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూల ధన వ్యయంలో రాష్ట్రం దూసుకుపోతోంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు మూలధన వ్యయంపై కాగ్ విడుదల చేసిన నివేదికల ద్వారా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని స్పష్టమైంది. బడ్జెట్‌లో మూల ధన వ్యయం కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి జూలై వరకు నాలుగు నెలల్లోనే 47.79 శాతం వ్యయం చేసినట్లు కాగ్ నివేదికలో వెల్లడయ్యాయ. ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏపీ మూల ధన వ్యయం రూ.14,844.99 కోట్లు అని, ఇది బడ్జెట్‌లో మూల ధన వ్యయ కేటాయింపుల్లో 47.79 శాతంగా ఉందని తెలిపింది.
ఈ నాలుగు నెలల్లో కేరళ మూల ధన వ్యయం రూ.4,117.87 కోట్లు కాగా ఇది బడ్జెట్ కేటాయింపుల్లో 28.19 శాతంగా కాగ్ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్‌లో మూలధన వ్యయ కేటాయింపుల్లో తొలి త్రైమాసికంలో 27.8 శాతం వ్యయం చేయగా, ఎపీ 40.8 శాతం వ్యయం చేసినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. తొలి త్రైమాసికంలో ఇంత పెద్ద ఎత్తున ఏపీ ప్రభుత్వం మూల ధన వ్యయం చేయడం స్వాగత సంకేతమని ఆ నివేదిక పేర్కొంది. తొలి త్రైమాసికంలో మూలధన వ్యయంలో ఎపీ తరువాత తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
కాగా, ప్రస్తుత ఆ ర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్ నుంచి మే వరకు) కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు బడ్జెట్‌లో మూలధన వ్యయం కేటాయింపుల్లో ఎంత మేర వ్యయం చేశాయనే వివరాలను ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. కేంద్రంతో పాటు దేశంలోని ఏ ఇతర రాష్ట్రాలు చేయనంత మూలధన వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి త్రైమాసికంలోనే చేసిందని ఆ నివేదిక వెల్లడించింది. మొదటి త్రైమాసికంలో అన్ని రాష్ట్రాల సరాసరి చూస్తే మూలధన వ్యయం బడ్జెట్ కేటాయింపుల్లో 12.7 శాతంగా ఉంది. మూలధన వ్యయం అంటే ఆస్తుల కల్పన వ్యయంగా పరిగణిస్తారు.
వ్యవసాయం, విద్య, వైద్యం, రహదారులు రంగాల్లో ఆస్తుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పనులను చేపట్టిన విషయం తెలిసి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరో పక్క ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. మూలధన వ్యయంలో గత ప్రభుత్వం కన్నా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెరుగ్గావుంది. మూలధన వ్యయం వల్ల ప్రభుత్వానికే కాక ప్రజలకు ఆదాయ వృద్ధి జరుగుతుంది. ప్రజల వినిమయ శక్తి పెరిగి మార్కెట్‌లో సరుకులకు డిమాండ్ పెరిగి పారిశ్రామికీకరణ, సేవారంగం వృద్ధి అవుతుంది.
అలాగే పెట్టుబడుల వ్యయ కల్పన వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వివిధ రూపాల్లో పెరుగుతాయి. ఉత్పత్తి, ఉత్పాదక శక్తి పెరుగుదలతో పాటు ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గుముఖం పడతాయి. ప్రాధాన్యత గలిగిన ఈ వ్యయాలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యత కల్పిస్తోంది. అభివృద్ధిలో ప్రభుత్వ పెట్టుబడులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్య, సామాజిక మౌళిక సదుపాయాలు, రహదార్లు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక ప్యాకేజీలు తదితర వాటిపై ప్రభుత్వం తన బడ్జెట్ ద్వారా చేసే వ్యయాన్ని మూలధన వ్యయం అంటారు.
ఈ వ్యయం వల్ల ప్రభుత్వానికే కాక ప్రజలకు ఆదాయ వృద్ధి జరుగుతుంది. ప్రజల వినిమయ శక్తి పెరిగి మార్కెట్‌లో సరుకులకు డిమాండ్ పెరిగి పారిశ్రామికీకరణ, సేవారంగం వృద్ధి అవుతుంది. అలాగే పెట్టు-బడుల వ్యయ కల్పన వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వివిధ రూపాల్లో పెరుగుతాయి. ఉత్పత్తి, ఉత్పాదక శక్తి పెరుగుదలతోపాటు- ప్రాంతీయ అసమానతలు కూడా తగ్గుముఖం పడతాయి.