Friday, September 20, 2024

AP – హైవే పనుల్లో.. కదలిక! స్పీడప్​ చేస్తున్న చంద్రబాబు

₹ 58,817 కోట్లతో 105 రోడ్లు మంజూరు
ఎన్‌హెచ్ఏఐ పరిధిలో 48 ప్రాజెక్టులు
మెర్త్​కు 57 ప్రాజెక్టుల అప్పగింత
ప‌లు చోట్ల భూసేకరణ వివాదాలు
అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్న అటవీశాఖ
₹6,695 కోట్ల 30 ప్రాజెక్టులకు బ్రేకులు
సమస్యల పరిష్కారానికి చంద్ర‌బాబు స‌మాలోచ‌న‌లు
నలుగురు ఉన్న‌తాధికారుల‌తో కమిటీ ఏర్పాటు
త్వర త్వరగా కదులుతున్న ఫైళ్లు

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్‌:

ఏపీలో కొత్త జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు మంజూరు చేసినా.. వాటిని సకాలంలో పూర్తి చేయించటానికి గత పాలకులు అసలు పట్టించుకోలేదు. చిన్న సమస్యల పరిష్కారాన్ని పక్కన పడేశారు. ఇంకేముంది హైవే పనులు బెడ్ ఎక్కి నిద్దరోతున్నాయి. ముఖ్యంగా భూసేకరణలో జాప్యం, అటవీ భూముల అంశాలను గాలికి వ‌దిలేశారు. దీంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కాగితాల్లోకి నిధులు ఇచ్చాయి. కానీ, ప‌నులు మాత్రం కాలేదు. ఈ స్థితిలో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన సీఎం చంద్ర‌బాబు జాతీయ రహదారుల పనులపై నజర్ పెట్టారు. త్వరితగతిన పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. కాంట్రాక్ట‌ర్ల‌కు పనులు అప్పగించేందుక ఒప్సించారు.

- Advertisement -

ఫండ్స్​ ఉన్నా.. పనులు సాగలేదు

జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని 57 ప్రాజెక్టుల్లో 30 రోడ్డు పనులు మూలన పడ్డాయి. అతంత జాప్యం నెలకొంది. ₹6,695 కోట్ల ఖర్చుతో 761 కిలోమీటర్ల రోడ్డు పనుల్లో 15 ప్రాజెక్టులకు భూసేకరణ జరగలేదు. అంతే .. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించలేదు. ముదిరెడ్డిపల్లె నుంచి నెల్లూరు సరిహద్దు వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారిలో 7.5 కిలోమీటర్ల మేర కడప జిల్లాలో భూ సమస్య ఉంది. కత్తిపూడి – ఒంగోలు ఎన్‌హెచ్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని రాజోలు వద్ద అర కిలో మీటర్ బైపాస్, పాసర్లపూడి వద్ద 2.5 కిలో మీటర్ల మేర బైపాస్‌ పనులు మూడేళ్లుగా నిలిచిపోయాయి. అక్కడి భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం సరిపోదని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. గత ప్రభుత్వం రైతులతో చర్చించలేదు. పనులను అలాగే వదిలేసింది.

ఫోర్​ లైన్స్​ రోడ్డుకు భూ సేకరణ చిక్కులు..

పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట నుంచి నకిరేకల్‌ సెక్షన్‌లో 38 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి భూసేకరణలో చిక్కులున్నాయి. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన తొమ్మిది ప్రాజెక్టులు అటవీ భూముల సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఆ శాఖతో చర్చించే యత్నమూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయలేదు. భద్రాచలం – కుంట జాతీయ రహదారిలో 2 కిలోమీటర్ల విషయంలో ఏపీ, తెలంగాణ అటవీ శాఖ మధ్య వివాదం నడుస్తోంది. వైఎస్సార్ జిల్లాలో కమలాపురం సమీపంలో పాపాఘ్ని నదిపై వంతెన నిర్మాణం 74 శాతం జరిగాక, అటవీ అధికారులు అభ్యంతరాలు చెప్పారు. ఆ నిర్మాణం ఆగిపోయింది. పల్నాడు, ప్రకాశం జిల్లాలో జాతీయ రహదారి పనులకూ అటవీ శాఖ క్లియరెన్స్‌ రాలేదు.

ఏపీ అధికారుల్లో కదలిక..

నేషనల్ హైవే ప్రాజెక్టుల్లోని సమస్యలను ఇటీవల మోర్త్ ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన సీఎం నలుగురు ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటునకు ఆదేశించారు. భూసేకరణ సమస్యలకు సీసీఎల్‌ఏ, అటవీ భూముల అంశాలపై అదనపు పీసీసీఎఫ్‌తో పాటు, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శితో కమిటీ వేశారు. వేగంగా ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఆదేశాలిచ్చారు. ప్రతినెలా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ స్థితిలో ఏపీ అధికారుల్లో కదలిక ప్రారంభమైది. రోడ్డు పనుల్లో వేగం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement