అమరావతి, ఆంధ్రప్రభ : భూగర్భ జలాల పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్ హెచ్ పీ)లో ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్టు- కేంద్రం ప్రకటించింది. భూగర్భ జలాల వినియోగం తక్కువ-లభ్యత ఎక్కువ ఉన్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఏపీలో 13.09 లక్షల నీటి సంరక్షణ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టినట్టు తాజా నివేదికలో కేంద్రం వెల్లడించింది. వర్షపు నీరు అత్యధికంగా భూమిలోకి ఇంకించే చర్యలు చేపట్టటంతో రీజనరేట్ అవుతున్న జలాల పరిమాణం కూడా పెరుగుతోంది. దీనికి వర్షాలు కూడా తోడవటంతో 2020 నుంచి ప్రతి ఏడాది ఏపీలో సగటున 208 టీఎంసీల భూగర్భ నీటి లభ్యత సాధ్య పడిందని నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు వెల్లడించింది. ఒక వైపు భూగర్భ నీటి లభ్యత పెరగటంతో పాటు మరో వైపు ప్రతి సంవత్సరం సగటున 48 టీఎంసీల వినియోగం తగ్గించిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా సగటున 5.65 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. దీంతో సాగు, తాగునీటి కొరత ఏపీలో నమోదు కావటం లేదని ఎన్ హెచ్ పీ ప్రకటించింది.
సూక్ష్మ సేద్యంతో భూగర్భ జలాల పొదుపు
రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు అమలులో భాగంగా బిందు, తుంపర సాగు విస్తీర్ణాన్ని పెంచటం ద్వారా భూగర్భ జలాల పొదుపు సాధ్య పడిందని అంచనా. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 15 లక్షల వ్యవసాయ బోర్ల కింద 40 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పంటలు పండిస్తున్నారు. గతంలో బోర్ల కింద కూడా వరిని అధికంగా సాగు చేసే రైతులు ఇపుడు ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించారు. ప్రభుత్వం కూడా బోర్ల కింద వరి సాగును తగ్గించాలని రైతులను కోరుతోంది. ఫలితంగా భూగర్భ జలాల వినియోగం సగానికి సగం తగ్గిపోయినట్టు భావిస్తున్నారు.భారీ సబ్సిడీలు ఇస్తూ డ్రిప్, స్పింక్లర్ల పరికరాలను రైతులకు పంపిణీ చేయటంతో తక్కువ నీటి వినియోగంతో కూడిన సూక్ష్మ సేద్యం విస్తీర్ణం పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బోరు బావుల కింద సుమారు 35 లక్షల ఎకరాల్లో రైతులు బిందు, తుంపర్ల సేద్యం చేస్తున్నట్టు అంచనా. భూగర్భ జలాల పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం 1245 ఫిజియో మీటర్లను ఏర్పాటు చేసి భూగర్భ నీటి మట్టం పడిపోకుండా ఎప్పటికపుడు పర్యవేక్షణ చేస్తోంది. ఈ మేరకు బోరుబావులను జియో ట్యాగింగ్ చేసి తక్కువ నీటి వినియోగంతో కూడిన స్వల్పకాలిక పంటల వైపు రైతులు దృష్టి మరల్చేలా ప్రోత్సాహకాలు అందిస్తోంది.