న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న వైఎస్సార్సీపీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు మెడలు వంచి నిలబడిందని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. హోదాను పూర్తిగా గాలికొదిలేశారని, మిగతా హామీల సాధన కోసం చేసే ప్రయత్నం కూడా ఏమీ లేదని మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. అనంతరం న్యూఢిల్లీలోని గల్లా జయదేవ్ నివాసంలో కనకమేడల రవీంద్ర కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం లేదని సాకు చూపుతూ అప్పుల మీద అప్పులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేను పరిశీలిస్తే, రాష్ట్ర ఆదాయం పెద్దగా ప్రభావితం కాలేదని అర్థమవుతోందని కనకమేడల వ్యాఖ్యానించారు. కొత్త అప్పుల కోసం, లేదా అప్పుల పరిమితి పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పదే పదే కోరుతోందని, రాష్ట్రంలో గాడితప్పిన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని అఖిలపక్ష సమావేశంలో కోరామని ఆయన వివరించారు.
అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలని అభిప్రాయపడ్డాయని కనకమేడల తెలిపారు. సమావేశాలకు అడ్డుతగిలేవారిపై చర్యలు తీసుకోవాలని కొన్ని పార్టీలు కోరాయని, సమస్యలపై చర్చకు అవకాశమిస్తే ఈ పరిస్థితి తలెత్తదని కొందరు నేతలు వ్యాఖ్యానించారని అన్నారు. కోవిడ్-19 వాక్సిన్ అన్ని వయస్సుల వారికి అందించేలా చర్యలు చేపట్టాలని తాము కేంద్ర ప్రభుత్వానికి సూచించామని తెలిపారు. కోవిడ్ మరణాల విషయంలో నమోదైన తప్పుడు లెక్కలను దృష్టిలో పెట్టుకుని బాధిత కుటుంబాలందరికీ పరిహారం అందేలా చూడాలని కోరామన్నారు.
రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో పొందుపర్చిన హామీల అమలుకు ఇంకా రెండేళ్లే సమయం ఉందని గుర్తుచేస్తూ.. నిర్ణీత కాలవ్యవధిలోగా హామీలన్నీ పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరినట్టు కనకమేడల తెలియజేశారు. ఈ మధ్య సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి, ఇచ్చిన మెమొరాండంలో ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని కనకమేడల అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలలో జాప్యం గురించి ప్రస్తావించారని, అయితే పోలవరంలో అవినీతి జరిగిందంటూ గతంలో వైఎస్సార్సీపీ ఇచ్చిన ఫిర్యాదులే ఈ జాప్యానికి కారణమని తేలిందని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని కోరడంతో పాటు అమరావతి రాజధాని అంశాన్ని కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించినట్టు చెప్పారు. చాలా ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా సకాలంలో విడుదల చేయడం లేదని పేర్కొంటూ ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి లేఖ రాసిందని, దాన్నిబట్టే రాష్ట్ర ఆర్థిక స్థితిని అంచనా వేయవచ్చని కనకమేడల వ్యాఖ్యానించారు.
ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బహుశా ఢిల్లీలోనే మకాం వేసినట్టు కనిపిస్తోందని, ఎప్పుడు చూసినా కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో కనిపిస్తున్నారని అన్నారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది చాలక, మళ్లీ కొత్తగా అప్పులు చేయడానికి, అప్పు పరిమితి పెంచుకోడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతున్నారని ఆయనన్నారు. ఎఫ్ఆర్బీఎం పరిమితిని 90% నుంచి 180% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు రూపొందించిందని, కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్న ఈ బిల్లును నిశితంగా పరిశీలించాల్సిందిగా కోరామని తెలిపారు. ఇదే గనుక కేంద్ర ఆమోదం పొందితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దివాళా తీస్తుందని, జీవన ప్రమాణాలు పడిపోయి ప్రజలంతా రోడ్డున పడే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు.
రాష్ట్రంపై 2014 వరకు రూ. 3.08 లక్షల కోట్లు రుణభారం ఉండగా, గత మూడేళ్ళలోనే రూ. 3 లక్షల కోట్ల పైన అప్పులు చేశారని కనకమేడల మండిపడ్డారు. ఆదాయం లేదని చెబుతూ, లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారు, ఇదంతా ఎలా తీర్చాలని ప్రశ్నించారు. ఇన్ని సమస్యలు ఉంటే, సమస్యల గురించి మాట్లాడకుండా, సభలో ఎవరైనా గలాటా చేస్తే వారిని సస్పెండ్ చేయండి అంటూ వైఎస్సార్సీపీ నేతలు అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదని, మిగతా సమస్యల గురించి కూడా మాట్లాడిందేమీ లేదని, కంటి తుడుపుగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే మాట్లాడారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు దారుణంగా పడిపోయినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడిస్తోందని కనకమేడల అన్నారు. స్థూల జాతీయోత్పత్తిలోనూ రాష్ట్రం వెనుకంజలో ఉందని చెప్పారు. నిరుద్యోగ రేటు బాగా పెరిగిందని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధం విషయంలో గతం కంటే హీనంగా రాష్ట్రం తయారైనట్టు నివేదిక పేర్కొందని చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి తాము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో 2019 మే వరకు ఒక్క బిల్లు కూడా పెండింగులో లేదని, అలాంటిది ప్రస్తుతం ఈ విభాగంలో వేల కోట్ల మేర ఉద్యోగులకు వేతనాలు బకాయిపడ్డారని, వందల కోట్ల కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగులో ఉన్నాయని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కక్షసాధింపు రాజకీయాల కారణంగా రాష్ట్రంలో అన్నింటి విలువ పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే, ఏపీలో 4 ఎకరాలు కొనొచ్చు అంటూ ఎద్దేవా చేసే పరిస్థితి నెలకొందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై కేసుల్లో తప్ప ఎందులోనూ అభివృద్ధి లేదని విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..