ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో ఈ నెల 7, 8 తేదీల్లో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల ఏర్పాట్లకు 7న, పోలింగ్ కోసం 8న సెలవులు ఇస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సంస్థలకు సెలవు ప్రకటిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు. దుకాణాలు,వాణిజ్య సంస్థలు కూడా సెలవు పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో 48గంటలు ముందుగానే మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించింది.
ఈ నెల 1న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా ఈ నెల 8న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. 10న ఫలితాలు వెల్లడిస్తారు. ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే ఈనెల 9న రీ పోలింగ్ నిర్వహిస్తారు. గత ఏడాది మార్చి 14న ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిన చోటు నుంచే ప్రక్రియ కొనసాగనున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేశారు.