న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. వచ్చే నెల 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బుగ్గన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌తో కలిసి ఢిల్లీ పర్యటన చేపట్టారు. 13 రంగాలకు చెందిన కేంద్రమంత్రులు సదస్సులో పాల్గొనాల్సి ఉండడంతో వారిద్దరూ కలిసి గురు, శుక్రవారాల్లో పలువురు కేంద్రమంత్రులను కలిసి ఆహ్వానం పలికారు.
మంత్రి అమర్‌నాథ్ విజయవాడ తిరిగి వెళ్లగా శనివారం బుగ్గన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. సమ్మిట్‌కు ఆహ్వానం పలకడంతో పాటు రాష్ట్ర ఆర్థిక అంశాలపై ఆమెతో సవివరంగా చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రాజేంద్రనాథ్ కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను ఆయన నివాసంలో కలిశారు. సదస్సులో పాల్గొనవలసినదిగా ఆయనకు ఆహ్వానం పలికారు.