విజయవాడ: తెలుగులో చదువుకుంటే ఉద్యోగాలు రావని భయపడాల్సిన అవసరం లేదని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు. తెలుగులో చదువుకుని ఎందరో ఉన్నత స్థానాలకు వెళ్లారని.. తాము కూడా మాతృభాషలోనే చదువుకున్నామని చెప్పారు. వృత్తిరీత్యా ఆంగ్లం నేర్చుకున్నామన్నారు.
విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభల రెండో రోజైన నేడు చెరుకూరి రామోజీరావు సభావేదికపై. ‘తెలుగులో న్యాయపాలన’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
‘మేమంతా తెలుగులోనే చదువుకున్నాం. వృత్తిరీత్యా ఆంగ్లం నేర్చుకున్నాం. కొందరు న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు ఇవ్వడం సంతోషకరం. న్యాయాధికారి కొరిశపాటి బాలకృష్ణారెడ్డి మాటలను గుర్తుచేసుకుందాం. ‘తేటతెలుగుతో న్యాయస్థానాన్ని నింపేద్దాం’ అని ఆయన అన్నారు. మన కక్షిదారులు, ముద్దాయిలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు అందరికీ తెలుగు వచ్చు. ప్రజల కోసం పనిచేయాల్సిన సేవా సంస్థ.. న్యాయ వ్యవస్థ. రాష్ట్రంలో 99.99శాతం మందికి తెలుగు వచ్చు. కోర్టుల్లో వాద, ప్రతివాదాలు వచ్చీరాని ఆంగ్లంలోనే కొనసాగుతాయి. మన చట్టాలు కూడా ఆంగ్లంలోనే ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలి. కేసులు, విచారణల గురించి కోర్టుకు వచ్చిన వారికి తెలియాలి”అని జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి అన్నారు.