Friday, November 22, 2024

Delhi | పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు సహకరించండి.. ఆర్థిక మంత్రిని కోరిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వచ్చే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. నెల రోజుల వ్యవధిలో రెండు పర్యాయాలు ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను కలిశారు. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న ఆయన తొలుత ఆర్థిక మంత్రినే కలవాలని అనుకున్నప్పటికీ వీలుపడలేదు. బుధవారం రాత్రి ఆలస్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం జగన్, గురువారం ఉదయం గం. 11.00 సమయంలో ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు కోసం అడ్‌హక్ నిధిగా రూ. 10 వేల కోట్లు కేటాయించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.

ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి, బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తోంది. అయితే కేంద్రం బిల్లులను తిరిగి చెల్లించడంలో జాప్యం జరుగుతుండడం వల్ల ప్రాజెక్టు నిర్మాణంపైనా ఆ ప్రభావం పడుతోందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లతో అడ్‌హక్ నిధిని ఏర్పాటుచేసినట్టయితే ప్రాజెక్టు నిర్మాణం వేగంగా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. గురువారం నిర్మల సీతారామన్‌తో జరిగిన భేటీలో ఈ విషయంపైనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. అలాగే వరదల కారణంగా దెబ్బతిన్న డయాఫ్రం వాల్ మరమ్మతు పనులకు రూ. 2,020 కోట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు నిధులు విడుదల చేస్తే రుతుపవనాలు ప్రవేశించి మళ్లీ వరదలు వచ్చేలోగా మరమ్మతు పనులు పూర్తిచేయవచ్చని సూచించారు.

- Advertisement -

మరోవైపు పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.2,600.74 కోట్లను సత్వరమే తిరిగి చెల్లించాలని ఆర్థిక మంత్రిని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించిన నేపథ్యంలో వెంటనే ఆ మొత్తానికి ఆమోదం తెలపాలని సీఎం జగన్ కోరారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాల గురించి కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఇతర అంశాల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి విడుదల చేయాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా… రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని, నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించారని నిర్మల సీతారామన్‌కు సీఎం జగన్ వివరించారు.

ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాలని మరోసారి సీఎం జగన్ కోరారు. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద రూ.36,625 కోట్లు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసినట్టు సీఎం కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. సీతారామన్‌తో భేటీ అనంతరం సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడకు బయల్దేరారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement