విజయవాడ: ముంబయి నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు కుక్కల విద్యాసాగర్ పై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, చిత్ర హింసలకు గురి చేశారని తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలిసి ముంబయి నటి శుక్రవారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో విద్యాసాగర్, మరికొందరిపై 192, 211, 218, 220, 354, 467, 420, 469, 471, రెడ్‌విత్ 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ముంబయి నటి శనివారం కూడా ఇబ్రహీంపట్నం పీఎస్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన వివరాలు అందజేశారు.
జత్వానీ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన పోలీసులపై ఇప్పటికే చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ కేసులో కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ఐపీఎస్‌లు పి.సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. నేడో రేపో ప్రభుత్వ నిర్ణయం వెలువడే అవకాశముందని సమాచారం.