Saturday, September 21, 2024

Delhi | పురంధేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు.. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారతీయ జనతా పార్టీ సంస్థాగత మార్పులు చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి బాధ్యతలు అప్పగించింది. మంగళవారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి – హెడ్‌క్వార్టర్స్ ఇంచార్జి అరుణ్ సింగ్ పేరిట విడుదల చేసిన సంస్థాగత నియామక పత్రంలో పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించడంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ మరో నియామక పత్రాన్ని విడుదల చేసింది.

అంతకంటే ముందు హెడ్‌క్వార్టర్స్ నుంచి పార్జీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా స్వయంగా సోము వీర్రాజుకు ఫోన్ చేసి రాజీనామా చేయాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. అయితే సోమవారం ఉదయం నుంచి పార్టీ అధ్యక్షుడి మార్పు గురించి చర్చ జరిగింది. ఈ క్రమంలో జాతీయ కార్యదర్శిగా ఉన్న వై. సత్యకుమార్ పేరుతో పాటు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు ఎక్కువగా వినిపించింది. అనూహ్యంగా అధిష్టానం పురంధేశ్వరిని తెరపైకి తీసుకొచ్చింది. అధిష్టానం ఈ నిర్ణయం వెలువరించే సమయానికి ఆమె అమర్‌నాథ్ యాత్రలో ఉన్నట్టు తెలిసింది.

- Advertisement -

తెలుగు రాష్ట్రాలతో పాటు పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు కూడా అధ్యక్షులను నియమించిన అధిష్టానం..అన్ని చోట్లా కేవలం రాజకీయానుభవానికి తోడు పాలనానుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్టు అర్థమవుతోంది. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి ఆ తర్వాత పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ సహా ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడగల నేర్పరితనం ఉంది. వీటిన్నింటికీ మించి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) రాజకీయ వారసత్వాన్ని ఆమె కొనసాగిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ సంతానంలో పూర్తిస్థాయి రాజకీయాల్లో నిమగ్నమైన ఏకైక వ్యక్తి కూడా ఆమె ఒక్కరే ఉన్నారు.

అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని బలోపేతం చేసి, పొత్తులు లేకుండా సొంతంగా గెలుపొంది ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యం కూడా భారతీయ జనతా పార్టీ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో ఆర్థికంగా, వాణిజ్య – వ్యాపార – సినిమా – మీడియా రంగాల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న ‘కమ్మ’ వర్గంలో అత్యధికులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. పురంధేశ్వరి నియామకం ద్వారా వారిలో కొందరినైనా బీజేపీ తనవైపు ఆకర్షించుకోవాలని భావిస్తోంది. పైగా మహిళను అధ్యక్షురాలిగా చేయడం ద్వారా రాష్ట్రంలో మహిళా ఓటర్లను కూడా ఆకట్టుకోవచ్చని కమలనాథులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం ద్వారా ఆయన సేవలను కేవలం రాష్ట్రానికే పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పతనమయ్యాక వైఎస్సార్సీపీతో పాటు వేర్వేరు పార్టీల్లోకి వెళ్లిపోయిన రెడ్డి వర్గం నేతలతో పాటు, ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న బలమైన నేతలను కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఆకట్టుకోవచ్చని పార్టీ అంచనా వేస్తున్నట్టు తెలిసింది. మొత్తంగా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ సోము వీర్రాజు పదవీకాలం కూడా ముగియడంతో పాటు జాతీయస్థాయిలో జరుగుతున్న కసరత్తులో భాగంగానే ఈ మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement