Tuesday, November 26, 2024

పరీక్షలు వాయిదా వేయండి.. బాధితులను ఆదుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. పెరుగుతున్న కోవిడ్ ఉదృతి దృష్ట్యా పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయని, కరోనాను అదుపుచేసే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షలను రద్దు చేసి వారిని తర్వాత తరగతులకు ప్రమోట్ చేసిందన్నారు. పది, ఇంటర్ పరీక్షలను మాత్రం ప్రకటించిన షెడ్యూల్లోనే నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ లో పరీక్షలు నిర్వహించడం సమస్యగా పరిణమిస్తుందని అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు రావాల్సి ఉంటుందని, ఈ ప్రయాణాలు కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడతాయని తెలిపారు. అందువల్ల విద్యార్థుల భద్రత, రక్షణ దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని లేఖలో కోరారు.

కోవిడ్ వ్యాధిగ్రస్తులకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సా విధానాలు, ఛార్జీలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. కోవిడ్ వ్యాధి ప్రాణాంతకం కావడంతో ప్రైవేటు ఆసుపత్రులు రోగులను దోచేస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఈ చర్యలతో కొందరు అప్పులపాలైపోతున్నారు. కొందరు లక్షలు ఖర్చుచేసినా ప్రాణాలు నిలుపుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోగులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే వారికి తక్కువ ఫీజులతో వైద్య సౌకర్యం కూడా అందించడమే ప్రభుత్వ విధే అని గుర్తు చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స, విధించే ఛార్జీలపై సంబంధిత అధికారులతో నిత్యం పర్యవేక్షిస్తూ చర్చలు నిర్వహిస్తూ, ఒక విధి విధానాన్ని రూపొందించాలని సూచించారు.

కోవిడ్ వ్యాధి నియంత్రణకు అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సోము లేఖలో కోరారు. అవసరమైన రోగులందరికీ ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల పలువురు మరణిస్తున్న సంఘటనలు మనల్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని చెప్పారు. ఇలాంటి బాధాకరమైన సంఘటనలను మరల జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అందువల్ల కోవిడ్ చికిత్సలో ఉపయోగించే మందులు, ఇంజక్షన్లు ఎప్పుడూ స్టాకులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఇవి నల్లబజారులో అమ్మకుండా అసలైన ధరకు అందుబాటులో ఉంచేలా పర్యవేక్షించాలని తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను విశాఖతో పాటు విజయవాడ, రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement