న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జగనన్న ఇళ్ల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటికి పార్టీ రంగులు వేయడంపై భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆదివారం కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని ఆయన నివాసంలో కలిశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద అటు పట్టణాల్లో, ఇటు గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు దేశంలో ఇతర రాష్ట్రాల కంటే అధికంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసిందని గుర్తుచేశారు.
పెద్ద మొత్తంలో రాష్ట్రానికి ఇళ్లను కేటాయించినప్పటికీ నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. జాప్యానికి కారణాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణ పనుల పురోగతితో పాటు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇళ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడంపై రాష్ట్ర ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించాలని సోము వీర్రాజు కేంద్ర మంత్రికి సూచించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించి స్వయంగా పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరినట్టు ఆయన తెలిపారు. కేంద్ర సహకారంతో నిర్మాణం జరుగుతున్న ఇళ్లకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే బోర్డు కూడా పెట్టలేదని, ఈ విషయాన్ని కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సహకారం నిర్మించిన ఇళ్ళకు “జగనన్న కాలనీ – మోడీ అన్న ఇల్లు” అని పేరు పెట్టాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులను ఇళ్లకు ఉపయోగించవద్దని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇళ్లను సైతం ఇప్పటికీ ప్రజలకు అందివ్వకపోవడాన్ని వీర్రాజు తీవ్రంగా తప్పుబట్టారు.
పోలవరంపై కేంద్ర మంత్రిని కలుస్తాం
సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా కోరతామని సోము వీర్రాజు చెప్పారు. కేంద్ర మంత్రి ఇదివరకు ఒకసారి పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష జరిపారని, ప్రస్తుత స్థితిగతులపై ఆయన నుంచి సమాచారం కోరతామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు కోరుతోందని, ఈ పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోవాలని ఏపీ బీజేపీ భావిస్తోందని వివరించారు. మరోవైపు గ్రామ పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పంచాయితీ రాజ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. పంచాయితీ సర్పంచుల నిధుల విషయంలో రాష్ట్రంలో గందరగోళం నెలకొందని అన్నారు. సర్పంచులకు నిధులు నేరుగా ఇవ్వాలని కేంద్రానికి సూచిస్తామని చెప్పారు. సర్పంచుల ఖాతాల్లో పడ్డ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాల్లోకి మళ్లిస్తోందని విమర్శించారు. గ్రామీణ వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతోందని దుయ్యబట్టారు. గ్రామ పంచాయితీల నిధుల వ్యవహారంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని కూడా కలుస్తామని ఆయన తెలిపారు.