ఏపీలో జరిగిన భారత్ బంద్‌పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సెటైర్లు వేశారు. రైతుల కోసం జరిగిన బంద్‌లో రైతులు ఎవరూ పాల్గొనలేదని విమర్శించిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా బంద్‌లో వైసీపీ, టీడీపీలు కలవడం ఆశ్చర్యకరమైన విషయం అంటూ మండిపడ్డారు.. ఇక వైసీపీ, టీడీపీ పార్టీలు పార్లమెంట్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించిన బిల్లులకు ఎందుకు మద్దతు తెలిపాయి? అని సోము వీర్రాజు ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం లేదన్న ఆయన.. పంజాబ్, మహారాష్ట్రల్లో కొంత మంది పెట్టుబడి పెట్టి ఉద్యమాలు నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఏదో విధంగా నిందలు వేయడమే విపక్షాల పనిగా పెట్టుకున్నాయంటూ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.