Saturday, November 23, 2024

AP | బంగ్లాదేశ్​ యువతిని కాపాడిన పోలీసులు.. శ్రీసిటీలో ఘటన

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : అజ్మీర్ దర్గా సందర్శన కోసం భారత దేశానికి వచ్చి సమస్యల వలయం లో చిక్కుకున్న బంగ్లాదేశానికి చెందిన యువతి.. మూడేళ్ల తర్వాత తిరుపతి పోలీసులు సూపరింటెండెంట్ సహకారం తో స్వదేశానికి చేరుకున్న అరుదైన సంఘటన ఇది. 2019 సంవత్సరం బంగ్లాదేశ్ నుండి అజ్మీర్ దర్గా సందర్శనార్థం కుటుంబ సభ్యులతో రెహమాన్ అక్తర్ అనే మహిళ భారతదేశానికి వచ్చింది. ఆ సందర్బంగా దారి తప్పిపోయి, కుటుంబ సభ్యులకు దూరమై, తన పాస్పోర్ట్ తో సహా అన్ని దారపోసుకుని, మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనై, మతిస్థిమితం కోల్పోయింది. ఆ స్థితిలో ఎక్కడెక్కడో తిరుగుతూ చివరికి సత్యవేడు సమీపంలోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడ పరిసరాల్లోని అప్పయ్యపాలెం గ్రామంలో మతిస్థిమితం లేక నిస్సహాయ స్థితిలో తేలింది.

ఘోరమైన స్థితిలో పడి ఉన్న మహిళను చూసిన శ్రీ సిటీ సెజ్ సెక్యూరిటీ చీఫ్ రమేష్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన శ్రీ సిటీ పోలీసులు పూర్తిగా ఘోరమైన స్థితిలో ఉన్న ఆమెను చూసి చలించిపోయారు. తమ తోబుట్టువుగా తనవారుగా భావించి ఆమెకు సపర్యలు చేసి ఆమెను చేరదీసి అక్కున చేర్చుకుని కోర్టు వారి అనుమతితో తిరుపతి రుయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్యులు పరీక్షించిన అనంతరం వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని మానసిక వైద్యశాలకు తరలించి ఆమె బాగోగులను ఎప్పటికప్పుడు శ్రీ సిటీ పోలీసులు తెలుసుకుంటూ ఉన్నారు.

- Advertisement -

రెండేళ్లకు పైగా చికిత్స పొంది, ఆమె కోలుకుందని తిరిగి సమాచారం అందుకున్న అప్పటి చిత్తూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఆమె పేరు రెహమాన్ అక్తర్ అని, బంగ్లాదేశ్ దేశానికి చెందిన మహిళగా గుర్తించి, ఆమె కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించి తన స్వదేశానికి చేర్చడానికి ప్రయత్నం చేసినారు కానీ సఫలం కాలేదు. జిల్లాల విభజన సందర్భంగా శ్రీ సిటీ ప్రాంతం నూతన తిరుపతి జిల్లా లో భాగమైనది. తిరుపతి జిల్లా ఎస్ పి పరమేశ్వర రెడ్డి పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించిన సమయంలో బంగ్లాదేశ్ మహిళ కేసు వెలుగు చూసింది. ఆమె గురించి తెలుసుకుని చలించిపోయిన ఆయన . ఎలాగైనా సరే రెహమాన్ అక్తర్ ను ఆమె స్వదేశం బంగ్లాదేశ్ కు చేర్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కృషి మొదలుపెట్టారు.

ఆ క్రమంలో భారత విదేశాంగ శాఖ అధికారులను సంప్రదించి, తనదైన శైలిలో విశేష కృషి చేశారు..వారి కృషి ఎట్టకేలకు ఈరోజు ఫలించింది. మరోవైపు ఎన్జీవోలు, విశాఖ మానసిక వైద్యశాల సిబ్బంది, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో ఆ మహిళ వివరాలను ధ్రువీకరించుకుని, కేంద్ర అధికారుల ద్వారా బంగ్లాదేశ్ రాయబారి కార్యాలయానికి సమాచారం ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వారు పూర్తి విచారణ జరిపి నిర్ధారణ చేసుకున్నారు. ఆ తర్వాత నిన్న భారత్, బంగ్లాదేశ్ దేశాల సరిహద్దుల్లోని హరిదాస్ పూర్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు భారత దేశ అధికారుల సహకారంతో బంగ్లాదేశ్ అధికారుల ద్వారా రెహమాన్ అక్తర్ ను ఆమె కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి స్వదేశం దాటి మన దేశానికి వచ్చి నిస్సహాయరాలైన మహిళను స్వదేశానికి చేర్చడంలో విశేష కృషి చేసిన జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, క్రైమ్ అదనపు ఎస్పీ విమల కుమారి, శ్రీ సిటీ డిఎస్పి జగదీష్ నాయక్, సీఐ భాస్కర్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, అరుణ్ కుమార్ రెడ్డి, విశాఖపట్నంలోని ఆసుపత్రి సిబ్బంది, సహకరించిన ఎన్జీవోలు, భారత అధికారుల బృందం సభ్యులపై రెహమాన్ అక్తర్ కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశంసల జల్లులతో కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement