నదులు అనుసంధానం చేయడం నా కల
రాయలసీమలో గోదావరి నీళ్లు పారిస్తా
రతనాల సీమ గా మారుస్తా
మైదుకూరు ఎన్టీఆర్ వర్ధంతి సభలో చంద్రబాబు ఉద్ఘాటన
మైదుకూరు: గోదావరి-పెన్నా, పోలవరం – బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే గేమ్ ఛేంజర్ గా తయారవుతుందని చంద్రబాబు అన్నారు. బనకచర్లకు గోదావరి నీళ్లు తీసుకురావడం నా జీవితాశయమని స్పష్టం చేశారు. తనను ఇంత వాడిని చేసిన సీమ ప్రజలకు నీళ్లు అందించి వారి తీర్చుకోవాలనేదే నా ఆలోచన అని పేర్కొన్నారు. మైదుకూరులో నేడు నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో పాల్గొన్న ఆయన ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, తాను కూడా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడినేనని, తనకు రాయలసీమ సమస్యలపై పూర్తి అవగాహన ఉందంటూ చెప్పుకొచ్చారు చంద్రబాబు. రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యత నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తీసుకున్నారని, ఆ తర్వాత అదే పంథాను తాను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, రాష్ట్రంలో సాగు, త్రాగునీరుకు ఇబ్బందులు లేకుండా చేస్తానంటూ సీఎం హామీ ఇచ్చారు. గాలేరు, నగరి, హంద్రీనీవాకు పునాదులు వేసింది ఎన్టీఆర్ అన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని చంద్రబాబు తెలిపారు. కాంగ్రెస్ సహా మిగిలిన ఏ పార్టీలు కడపకు చేసిందేమీ లేదని, టీడీపీ హయాంలోని కడప జిల్లా అభివృద్ధి పథంలో నడిచిందంటూ చంద్రబాబు అన్నారు.
తట్ట మట్టి కూడా ఎత్తని జగన్
మాటలు చెప్పి ఎక్కడ ఒక తట్ట మట్టి కూడా పోయకుండా ఐదేళ్లు వైసీపీ పరిపాలన సాగిందని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లా క్లీన్ స్వీప్ కావాలంటూ కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. కార్యకర్తలు మరింత స్పీడ్ పెంచాలని, మొన్న ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చరిత్రను తిరగ రాశాయని చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానం కు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అప్పుడే కరువు రహిత రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందుతుందన్నారు.
పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం ఎన్టీఆర్
తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకూ తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. అనుక్షణం తెలుగువారి ఆత్మగౌరవం కోసం తపించిన నాయకుడు అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం. పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం ఎన్టీఆర్ ఆని పేర్కొన్నారు.. ప్రభుత్వం అంటే పాలకులు కాదని, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు అన్న ఎన్టీఆర్ అని ప్రశంసలు కురిపించారు.. పేదవాళ్లకు పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీఆర్ అని అన్నారు. బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యం అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.. సంక్షేమానికి అర్ధం తెచ్చారు. అభివృద్ధి అంటే చేసి చూపించారు. సంస్కరణలకు నాంది పలికిన యుగపురుషుడు ఆయన అంటూ అన్నారు.
ఈ నెలాఖరులోనే వాట్సప్ గవర్నెన్స్: సీఎం చంద్రబాబు
ఈ నెలాఖరులోనే వాట్సప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నా. ఏ పని కావాలన్నా ఒక మెసేజ్ పెడితే చాలు. మీ సమస్యల పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పనిలేదు. మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నాం.” అని ఈ సభలో చంద్రబాబు ప్రకటించారు..
ఇది ఇలా ఉంటే ఎన్నికల అనంతరం సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారిగా మైదుకూరుకు రావడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా మైదుకూరుకు భారీగా తరలివచ్చారు.. ఆయనకు అక్కడి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అలాగే మైదుకూరు నియోజకవర్గానికి సంబంధించి పలు హామీలను సైతం చంద్రబాబు సభ సాక్షిగా ప్రకటించారు.