Tuesday, November 26, 2024

గంజాయిని అరికట్టడంలో అగ్రస్థానంలో ఏపీ : తానేటి వనిత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మాదకద్రవ్యాల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఆ రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే పవన్ కళ్యాణ్ వంటివారు గంజాయికి రాష్ట్రం అడ్డాగా మారిందంటూ విమర్శలు చేస్తున్నారమని ఆమె వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్సు హాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయం తెలిపారు. దేశ అంతర్గత భద్రతపై హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన రెండ్రోజుల చింతన్ శిబిర్ (మేథోమథనం)లో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్న మంత్రి, సదస్సుకు హాజరయ్యే ముందు అక్కడ చర్చించే విషయాలను మీడియాకు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల హోం మంత్రులు పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో ప్రతి రాష్ట్రానికి ఒక అంశాన్ని కేటాయించారని, ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ‘మాదకద్రవ్యాల అక్రమ రవాణా’ అంశాన్ని అప్పగించారని తెలిపారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంత గిరిజనులు దళారుల ప్రలోభాలకు గురై గంజాయి అక్రమ సాగు చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మంత్రి వనిత చెప్పారు. ‘ఆపరేషన్ పరివర్తన్’ పేరుతో చేపట్టిన చర్యల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల్లోని 313 గ్రామాల్లో మొత్తం 7,552 ఎకరాల విస్తీర్ణంలోని రూ.9,251 కోట్ల విలువైన గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఈ స్ఫూర్తితో చైతన్యం పొందిన కొందరు గిరిజనులు స్వచ్ఛందంగా 395 ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేశారని వెల్లడించారు. దేశంలో మొత్తం 12 రాష్ట్రాల్లో గంజాయి సాగు జరుగుతోందని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) డేటా చెబుతోందని, ఈ సాగును అరికట్టడంతో పాటు గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక కూడా విడుదల చేసిందని మంత్రి తానేటి వనిత అన్నారు. దేశవ్యాప్తంగా 27,510 ఎకరాల్లో సాగు చేసిన గంజాయి పంటలో 40% అనగా 11,550 ఎకరాల గంజాయి పంటను ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ధ్వంసం చేసినట్టు ఆమె గణాంకాలతో సహా వివరించారు.

రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 2 లక్షల కేజీల గంజాయిని ధ్వంసం చేయగలిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గంజాయి అక్రమ సాగు, రవాణా నిరోధానికి చెక్ పోస్ట్ లు, 24X7 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడంతో పాటు గిరిజనుల్లో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించినట్టు తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గిరిజనులకు సబ్సిడీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందిస్తూ ప్రోత్సాహకాలు కల్పిస్తున్నామని చెప్పారు. సమాజం ముఖ్యంగా యువతలో మాదకద్రవ్యాల దుష్ప్రభావంపై అవగాహన కల్పించే విధంగా వివరణాత్మక పోస్టర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే యూనివర్సిటీలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.

మహిళల భద్రతలోనూ ఆదర్శంగా నిలుస్తున్నాం

సమాజంలో సగభాగమైన మహిళల భద్రతకు, సాధికారతకు ప్రభుత్వం అత్యధిక ప్రధాన్యతనిస్తోందని ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ ద్వారా స్నేహపూర్వక పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేశామని వ్యాఖ్యానించారు. మహిళా పోలీస్ స్టేషన్ లు, మహిళా మిత్ర, సైబర్ మిత్ర, గ్రామ సచివాలయ స్థాయిలో మహిళా సంరక్షక కార్యకర్తల వ్యవస్థ ఏర్పాటు, దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ లు, ట్రాక్ మై ట్రావెల్ యాప్ మొదలైనవి మహిళల భద్రత విషయంలో ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణాలని వివరించారు. దిశ యాప్ ను 1 కోటి 30 లక్ష మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని, ఈ యాప్ వల్ల 900 పైగా స్త్రీలు సకాలంలో సహాయం పొంది తమను తాము రక్షించుకున్నారని చెప్పారు. సహాయార్థులు ఈ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించిన 5 నిమిషాలలోనే తగిన సహాయం పొందగలిగారని మంత్రి వెల్లడించారు. దిశ పోలీస్ స్టేషన్ల వల్ల నిందితులను త్వరితగతిన విచారించడం, శిక్ష అమలు చేయడం సాధ్యమవుతోందని పేర్కొన్నారు.

చిన్నారుల భద్రతలో తల్లిదే కీలక పాత్ర

- Advertisement -

పసిపిల్లలు, చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టే విషయంలో తల్లి ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఏపీ హోంమంత్రి వనిత అన్నారు. కన్న తండ్రే అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కూడా కొన్ని వెలుగుచూశాయని, ఈ పరిస్థితుల్లో తల్లి పాత్ర కీలకమని వివరించారు. చిన్నారులు తమపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెప్పుకోలేరు కాబట్టి తల్లి అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం, చట్టాలు ఘటన జరిగిన తర్వాత చర్యలు తీసుకుంటాయని, జరగకముందే అడ్డుకోవడంలో తల్లి అప్రమత్తతే కాపాడుతుందని అన్నారు.

రైతులు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు

అమరావతి రైతు యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నవారిలో రైతుల బదులు రియల్ ఎస్టేట్ వ్యాపారులే ఉన్నారని మంత్రి తానేటి వనిత విమర్శించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఈ యాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసుల భద్రత లేకుండా జిల్లాల్లో పాదయాత్ర ఎలా పూర్తిచేస్తారని ఆమె ప్రశ్నించారు. పోలీసులు పాదయాత్రకు సహకరిస్తున్నారని, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వతంత్రత కల్పించామని అన్నారు. తెలుగుదేశం పాలనలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కాబట్టే ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజానికి ఏపీలో రైతులు సౌమ్యులని, ఆరుగాలం శ్రమించి పండించిన పంట నష్టపోతేనే ఇంట్లో బాధపడతారు తప్ప రోడ్డెక్కరని అన్నారు. ఒకవేళ రోడ్డెక్కినా బాధ చెప్పుకుంటారు తప్ప ఇష్టారీతిన మాట్లాడరని చెప్పారు. రైతుల పేరుతో పాదయాత్ర చేస్తూ రైతులను అవమానపరుస్తున్నది యాత్ర చేస్తున్నవారేనని ఆమె అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement