అల్లావుద్దీన్ అద్బుత దీపం లేదు
గత ప్రభుత్వం దుబారా ఖర్చు చేసింది
పంచాయతీలను నిర్వీర్యం చేసింది
రంగులు వేసి నిధులు దారి మళ్లించారు
అందుకే కేంద్రం నిధులు ఆపేసింది
డంపింగ్ యార్డుల్ని పట్టించుకోలేదు
రోడ్లు వేస్తే బిల్లులు చెల్లించలేదు
ఇప్పుడు చెత్తతో ₹2600 కోట్ల ఆదాయం వచ్చింది
రెండున్నర లక్షల మందికి ఉపాధి లభించింది
శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి :
మా దగ్గర అల్లావుద్దనీ అద్భుత దీపం ఏమీ లేదని.. కానీ, పక్కా ప్రణాళికతో పంచాయతీలను స్వయం సమృద్ధివైపు నడిపించే సత్తా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శాసన మండలిలో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా సమాధానం ఇచ్చారు.. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి ₹101 కోట్లు ఖర్చు అయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందులో రంగులు వేయడానికి ₹49 కోట్లు ఖర్చు కాగా, ఆ రంగుల్ని తొలగించి తిరిగి రంగులు వేయడానికి ₹52 కోట్లకు పైగా ఖర్చు అయిందని వెల్లడించారు. ఏపీ శాసనమండలిలో ఆయన తొలిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయితీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. ఈ విషయంపై పవన్ కల్యాణ్ సమాధానంగా ఇస్తూ … పంచాయితీల్లో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్ల నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికే సెంటు భూమి లేని పంచాయితీలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే 10, 15 పంచాయితీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు.
చెత్తతో సంపద సృష్టిస్తున్నాం
పంచాయతీల ద్వారా మోటివేషన్ తీసుకువస్తాం. 101 గ్రామ పంచాయతీల్లో చెత్తతో రూ.2600 కోట్లు ఆదాయం సమకూరింది. రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి. స్వచ్చాంధ్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకోవాలి. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తాం. బ్లీచింగ్ పౌడర్‌కే పంచాయతీల్లో డబ్బులు లేని పరిస్థితి. పంచాయతీకి నిధులు సమకూర్చే సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగుతాం. గ్రామాల్లో రోడ్డు వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకుంటాం. పంచాయతీలను అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు. సమూలంగా ప్రక్షాళన జరగాలి. స్వయం సమృద్ధిగా పంచాయతీలు ఎదగాలి. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా అన్ని పరిష్కారాలు ఒకేసారి అయిపోవు. ఈ ప్రాజెక్టును ముందు అమలు చేసి.. ఫలితాల చూసి.. అన్నిచోట్ల అమలు చేస్తాం. దీనికి కమ్మిట్మెంట్ ఉండే లీడర్ షిప్ ఉంటేనే ఇది సాధ్యం. పిఠాపురం లో 54 పంచాయతీ ల్లో మేము చేసేది చేయగా.. ఎన్ఆర్ఐలు ముందుకు వస్తే వారి సాయం తీసుకుంటాం అని పవన్ పేర్కొన్నారు.
పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు
సర్వీస్ అంటే ఎవరూ రారు.. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారు. అన్ని అనర్ధాలకు ఒకే ఐఏఎస్ కారణం. ఏ సమీక్ష చేసినా… ఆయనే మూల కారణం అంటున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. ఎవరిని బాధ్యులను చేయాలి, నిధులు ఎలా రికవరీ చేయాలి? కేవలం కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం పంచాయతీలకు రాష్ట్ర వాటా ఇవ్వలేదు. కేంద్రం కూడా నమ్మకం పోయి నిధులు ఆపేసింది. 70 ప్లస్ 30 నిధులు ఇస్తే పని అయ్యేది.. అది జరగలేదు. రకరకాల పేర్లు చెప్పి నిధులు మొత్తం మళ్లించారు. ముందు ఖర్చు పెట్టండి, తరువాత బిల్లు ఇస్తాం అని నమ్మబలికారు. డబ్బులు వచ్చినా.. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం ఇవ్వలేదు. అన్ని వ్యవస్థ ల్లో, పథకాల్లో ఇటువంటి ఛాలెంజ్‌లు ఉన్నాయి. వీటిని పెట్టుకుని వెంటనే అన్నీ చేయాలంటే మాకు సాధ్యం కాదు కదా.. అని పవన్ పేర్కొన్నారు.