Tuesday, November 26, 2024

AP Assembly – జ‌గ‌న్‌ అవినీతిని వెలికితీయాలంటే ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిందే : చంద్రబాబు

ఏపీ బ్రాండ్​ను దెబ్బతీశారు
ఏ రాజకీయ నేత చేయని తప్పులు చేశారు
అధికార యంత్రాంగం నిర్వీర్యమైంది
మూడు ముక్క‌లాట‌తో ఏపీ విధ్వంసం
రాజ‌ధాని లేక‌పోవ‌డంతోనే ఆదాయం దెబ్బ‌తిన్న‌ది
ప్రజల సొమ్మంతా దోచుకుతిన్నారన్న సీఎం చంద్రబాబు
జగన్​ అవినీతి వెలికి తీసేందుకే ప్రత్యేక మంత్రి ఉండాలి
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్​కు బీజేపీ శాసనసభాపక్షనేత విజ్ఞప్తి

ఆంధ్రప్రభ స్మార్ట్, వెలగపూడి : అదానీ కుంభకోణంపై ఏపీ శాసనసభలో తీవ్ర చర్చ జరిగింది. మాజీ సీఎం జగన్‌ను కూటమి సభ్యులు తూర్పారబట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అసత్యాలను పదేపదే చెప్పి ప్రజలను మాజీ సీఎం జగన్ మోసం చేశారని అన్నారు. ఏపీ బ్రాండ్‌ను జగన్ దెబ్బతీశారని ఏకిపారేశారు. చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనన్ని తప్పులు చేశారన్నారు. గతంలో వ్యవస్థలు, అధికార యంత్రాంగం నిర్వీర్యమైందని ఆరోపించారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అభివృద్ధి దిశ‌గా ఏపీని తీసుకెళ్తున్నామ‌ని, షార్ట్‌, మీడియం, లాంగ్‌ టర్మ్‌ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిని విధ్వంసం చేసిందని చంద్ర‌బాబు ధ్వజమెత్తారు. రాజధాని ఉంటే ఏటా ఆదాయం పెరిగేది, హైదరాబాద్‌తోనే తెలంగాణ ఆదాయం పెరిగింది, కానీ, మూడుముక్కలాటతో అమరావతి ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ను గోదావరిలో కలిపారని చెప్పారు. భద్రత లేక ఏపీకి పెట్టుబడులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవాలను పక్కనబెట్టి వాళ్లు నమ్మిన అవాస్తవాలను ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. బరితెగించి తప్పులు చేసి.. ఆ తప్పులను ఒప్పులుగా చిత్రీకరించారని అన్నారు.

- Advertisement -

ఆయన స్కామ్ లీడరయ్యారు

బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో ఏ కుంభకోణం జరిగినా మాజీ సీఎం జగన్ పేరు వస్తోందని అన్నారు. అమెరికాలో జగన్‌పై చార్జిషీట్ వేశారని..అందులో జగన్ పేరు ఉందన్నారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులో కూడా అడానికి వాటా ఇచ్చారని చెప్పారు. మాజీ సీఎం జగన్‌కు ₹1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా నుంచి చాలా మంది ఫోన్ చేసి జగన్ గురించి తనను అడుగుతున్నారని చెప్పారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరారు. ఇది ప్రజా సొమ్ము కావడంతో దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏమి చేయకపోయినా ఆయనను 53 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై అందరం బాధపడ్డామన్నారు. జగన్ ఎవడబ్బ సొమ్ముని రుషికొండపై ప్యాలెస్ నిర్మించారని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజానిజాలు తేల్చాల్సి అవసరం ఉందన్నారు.

ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారు..

రాష్ట్ర పేరు ప్రతిష్టలు దెబ్బ తింటున్నా మనం చేతులు ముడుచుకొంటే ఎలా అని బీజేపీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మనం చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశం అంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా జగన్ మోహన రెడ్డి పేరు తెలిసి పోయిందని ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. ఇప్పటి వరకూ స్కామ్ జరిగితే రాష్ట్రానికే పరిమితం అనుకుంటే ఇప్పడు ఆయన స్కామ్‌ల విషయంలో ఆయన స్కామ్ లీడర్ అయ్యారని విమర్శించారు. ఎక్కడ గంజాయి దొరికినా ఆ రూట్స్ అన్ని ఏపీలోవే అని చెప్పారు. ఏదో పెద్ద స్కామ్ కింద అభియోగాలు ఉండి అమెరికాలో ఓ ఆర్గనైజేషన్ ఎక్స్‌పోజ్ చేసిందన్నారు. అసలు జగన్ పేరు దానిలో ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.

ఏపీ ప్రజల సొమ్మును దోచేశారు

రుషికొండలో ₹450 కోట్లు అన్నారని.. దీనిలో ₹150 కోట్లు స్కామ్ ఉందని ఎమ్మెల్యే ఆరోపించారు. గంగవరం పోర్టులో ఏపీ ప్రభుత్వానికి 10.4 శాతం షేర్ ఉందని తెలిపారు. దాన్ని కూడా కేవలం ₹651 కోట్లకు ఇచ్చేస్తే తన మనస్సు ఎంతో బాధపడిందన్నారు. అయితే ఆ షేర్ వ్యాల్యూ ₹2000 కోట్లు ఉంటుందని ఐఏఎస్ శర్మ లేఖలు రాశారని గుర్తుచేశారు. ఆ కంపెనీ పేరు పెద్దపేరు చెబితే సమస్యలు వస్తాయన్నారు. ఏమీ లేకుండా చంద్రబాబును 53రోజులు అరెస్టు చేస్తే మనస్సు క్షోబించిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్దకు రాకుండా మౌనంగా బాధపడిన వ్యక్తుల్లో తాము ఉన్నామని తెలిపారు. జగన్‌పై ఇంకా ఎన్నో విషయాల్లో చర్చించాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కోరుతున్నానని అన్నారు.

జగన్​ అవినీతి వెలికితీసేందుకే మంత్రి ఉండాలి..

సపరేట్‌గా జగన్ అవినీతిని వెలికితీయడానికి మంత్రిపదవి ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. అందరూ అడుగుతున్నారు జగన్ నీ ఫ్రెండ్ కదా అని… ఆయన నాకు ఫ్రెండ్ ఎలా అవుతారని ప్రశ్నించారు. ఆయనే బిల్లులు ఇవ్వకుండా తనను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజల డబ్బును జగన్ దోచేశారని మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఈవ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు సంస్ధతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికాలో ఇంత జరిగితే కనీసం మాట కూడా మాట్లడకపోతే తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement