Tuesday, November 26, 2024

డ్రగ్స్ హబ్‌గా ఏపీ, రాజ్యమేలుతున్న ఇసుక, మైనింగ్ మాఫియా: కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ మాదకద్రవ్యాల హబ్‌గా మారిందని, ఇసుక-మైనింగ్ మాఫియా రాజ్యమేలుతున్నాయని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. సంక్రాంతి రోజు గుడివాడలో జరిగిన క్యాసినో అంశాన్ని ప్రస్తావించిన కనకమేడల… చివరకు జూదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెర మీదికి తెచ్చిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలపై కక్ష సాధింపు చర్యలకు, రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్సీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని వాపోయారు. భయాందోళనలు కలిగించేలా ఉన్న వైసీపీ పరిపాలన వల్ల రాష్ట్రానికి కొత్త పెట్టుబడులేవీ రావట్లేదని, ఉన్న పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయని ఎంపీ రవీంద్రకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా టికెట్ల వ్యవహారంలోనూ జోక్యం చేసుకుని ఇండస్ట్రీపై నియంత్రణాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుందని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ సినిమాలకు ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూరకంగా ఆటంకాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. టికెట్ల రేట్ల నియంత్రణ ప్రభుత్వ చేతుల్లో ఉండటం వల్ల సినిమాల విడుదలను వాయిదా వేసుకునే పరిస్థితి దాపురించిందని కనకమేడల వెల్లడించారు. ఇసుక, మైనింగ్ మాఫియా, డ్రగ్స్ వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో అమరావతిని ఏపీ రాజధానిగా అంగీకరించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని, మూడు రాజధానులకు తెర లేపారని మండిపడ్డారు. ఆయన చర్యల వల్ల తమకు ఇప్పటికీ రాజధాని లేకుండా పోయిందని కనకమేడల రవీంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement