Monday, November 18, 2024

Big story | గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా ఏపీ.. పెట్టుబడులకు అపార అవకాశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : వాతావరణ కాలుష్య రహిత, నాణ్యమైన విద్యుత్‌ను అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపడుతున్న చర్యలతో రాష్ట్రం గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి కేంద్రం (హబ్‌)గా అవతరిస్తోంది. తరిగిపోతున్న శిలాజ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పెరుగుతున్న వాతావరణ కాలుష్యానికి విరుగుడుగా స్వచ్ఛ ఇంధనాన్ని వినియోగంలోకి తేవడానికి జరుగుతున్న యత్నాల్లో రాష్ట్రంభాగం అవుతోంది. ఈప్రాజెక్టు కోసం గతేడాది కేంద్రం ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉంది. దీనికి ఆసుగుణంగా గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా పాలసీ 2029ని రాష్ట్రం రూపొందించింది. తాజాగా గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై న్యూ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఐడీసీఏపీ) తయారు చేసిన నివేదిక శ్వేతపత్రాన్ని సీఎం జగన్‌ ఇటీవల విడుదల చేశారు.

సమగ్రంగా శ్వేతపత్రం

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం సౌర, పవన విద్యుత్‌ వంటి స్వచ్చ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. హైబ్రిడ్‌ వ్యవస్థగా చెబుతున్న హైడ్రో స్టోరీజి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రానికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అనేక ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిలో సౌర, పవన, పంప్‌డ్‌ హైడ్రోజన్‌ సిస్టం ప్రాజెక్టులు 24 గంటలూ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి. కొత్త టెక్నాలజీల ఆవిర్భావం, గ్రీన్‌ హైడ్రోజన్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ వంటి వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంటోంది. తద్వారా రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ రంగంలో 10 బిలియన్‌ డాలర్ల నుంచి 15 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులకు అవకాశాలున్నాయి.

రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరాకు మౌలిక సదుపాయాలు ఉన్నాయి. రాష్ట్ర అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను ఎగుమతి చేయడానికి అవసరమైన గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో ఏటా 400 కిలో టన్నుల దేశీయ హైడ్రోజన్‌ డిమాండ్‌ ఉంది. దేశ పారిశ్రామిక హైడ్రోజన్‌ డిమాండ్‌లో ఇది దాదాపు 8 శాతం. ఇది ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఆమ్మోనియా పాలసీ 2023 ప్రకారం 2030 నాటికి కనీసం 500 కిలో టన్నుల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేయాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీని సాయంతో శిలాజ ఇంధన వినియో తగ్గించాలని భావిస్తోంది.

ఇందుకోసం యాక్సిలరేటింగ్‌ స్మార్ట్‌ పవర్‌ అండ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇన్‌ ఇండియా (అస్పైర్‌) ప్రోగ్రామ్‌ కింద ఫారిన్‌, కామన్వెల్త్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ సాయంతో ఆంధ్రప్రదేశ్‌గ్రీన్‌ హైడ్రోజన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాల నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం వ్యాపారాలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలపై వైట్‌ పేపర్‌లో వివరించారు. ఇది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర సంసిద్ధంగా ఉందని శ్వేతపత్రంలో పొందుపరిచారు.

కేంద్రం ఎంచుకున్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ

ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో ఐదు రాష్ట్రాల్లో జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. వీటిని 25 గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌ క్లస్టర్లుగా విభజించి, వివిధ రంగాలకు ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించింది. మొదటి తరం జాతీయ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులుగా పిలుస్తున్న వీటిలో పన్నెండు రసాయనాలు, రిఫైనరీ, ఉక్కు పరిశ్రమలలోని పారిశ్రామిక కార్బనైజేషన్‌ ప్రాజెక్టులు కాగా మూడు భారీ రవాణా ప్రాజెక్టులు, మరో మూడు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ (సీజీడీ) ప్రాజెక్టుల్లో హైడ్రోజన్‌ బ్లెండింగ్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. మిగిలిన ఏడు ప్రాజెక్టులు మునిసిపాలిటీల్లో వ్యర్థాల నుండి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసేవి. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో వీటి ద్వారా 2025 నాటికి 150 మెగావాట్ల గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి గ్రీన్‌ హైడ్రోజన్‌ పాలసీతో ఏపీ జీవం పోసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement