ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతీ జగన్ తన ఆరోపణలు నిరూపించాలని లేకుంటే చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హోంమంత్రి వంగలపూడి అనిత స్ప ష్టం చేశారు. రాష్ట్రంలో జరిగాయని చెప్తున్న రాజకీయ హత్యల వివరాలు ఇవ్వాలని జగన్ కు సూచించారు.రాష్ట్రంలో కేవలం నాలుగు రాజకీయ హత్యలు మాత్రమే జరిగాయని, వీటిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలే చనిపోయారని అనిత వెల్లడించారు..
విజయవాడలో నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ,! జగన్ మాత్రం 36 రాజకీయ హత్యలు జరిగాయని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని విమర్శించారు. అదే నిజమైతే జగన్ ప్రభుత్వానికి ఆయా హత్యల వివరాలు ఇవ్వాలన్నారు. ఈ వివరాలు ఇవ్వలేకపోతే ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదని వంగలపూడి అనిత ప్రశ్నించారు.
2019 నుంచి 2024 వరకూ అంబేద్కర్ రాజ్యాంగం పక్కనబెట్టి, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని, ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి, ఆయన సీఎంగా ఉంటే తాము బతకలేమని భావించే వారు ఎన్నికల్లో సరైన తీర్పు ఇచ్చారన్నారు.
ఎందుకు ఓడిపోయామన్న దానిపై చర్చించుకోవాల్సింది పోయి, వినుకొండలో వర్గ విభేదాల వల్ల జరిగిన హత్యతో రాజకీయాలు చేస్తున్నారని అనిత మండిపడ్డారు. జగన్ మాటల్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోకూడదన్నారు.
గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ, జనసేన నేతల్ని సీఐడీ ఆఫీసులకు రప్పించి కేసులు పెట్టారని హోంమంత్రి ఆరోపించారు. ఇప్పుడు బాధిత కుటుంబం పరామర్శకు వెళ్లి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగ ఉల్లంఘనలపై హైకోర్టు చీవాట్లు పెట్టిందని గుర్తుచేశారు.