న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై దాడికి రెక్కీ జరిగిందని వస్తున్న వార్తలపై అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దర్యాప్తు జరిపించాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. రెక్కీ జరగడం ముమ్మాటికీ తప్పేనని, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయకపోతే కేంద్రానికి చెప్పాలని.. అప్పుడు కేంద్రమే దర్యాప్తు జరిపిస్తుందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేనతో పొత్తు కొనసాగుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తాం.. ఏపీ పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు: సీఎం రమేశ్
పవన్ కళ్యాణ్ నివాసంపై రెక్కీ జరిగినట్టు వార్తలొచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్ అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవడానికి వచ్చిన ఆయన, మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ప్రభుత్వ అవినీతి, అరాచకాలపై ప్రశ్నిస్తే ఇలా చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ఒక పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
తప్పుడు కేసులు, వేధింపు చర్యలతో రౌడీల మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని, శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఎలా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కేంద్ర హోంమంత్రిని లేదంటే హోంశాఖ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్‌కు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అంతకంటే ముందు రెక్కీపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.