Sunday, September 8, 2024

AP | అగ్ని ప్రమాదం పై అనుమానాలున్నాయి : డీజీపీ తిరుమలరావు

మదనపల్లి, (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : అన్నమయ్య జిల్లా, మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు స్పష్టం చేసారు. ఈ ఘటన గురించి తెలియగానే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలమేరకు ఆయన సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ తో కలిసి ఈరోజు మదనపల్లి కి హెలికాప్టర్ లో వచ్చారు. సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

వివిధ శాఖల అధికారులతో చర్చించి సిబ్బందిని సమగ్రంగా విచారించారు. ముందుగా విద్యుత్ శాఖ అధికారుల ద్వారా ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరగలేదని నిర్ధారించుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు దర్యాప్తు చేసిన అనంతరం డిజిపి ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడారు…

అగ్ని ప్రమాదం జరిగిన ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించామని, ఈ అగ్గి ప్రమాదం ఆర్డీవో కార్యాలయంలో 22 (ఏ)కి సంబంధించిన విభాగంలో జరిగిందని తెలిపారు. ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు ఆదివారం రాత్రి ఎందుకు పని చేస్తున్నారు, అగ్ని ప్రమాదం జరిగిన చోట దొరికిన అగ్గిపుల్లలు, వంటి విషయాలు పలు అనుమానాలకు దారితీస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉందని, దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని చెప్పారు.

ఈ సందర్బంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూర మాట్లాడుతూ…. ఆర్డీవో కార్యాలయంలోని 22 (ఏ) వంటి పలు సబ్జెక్టులు చూసే విభాగంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ అగ్ని ప్రమాదంపై అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పి రాజ్ కమల్, డిఆర్ఓ సత్యనారాయణరావు, మదనపల్లి ఆర్డిఓ హరిప్రసాద్, రాయచోటి ఆర్డీవో రంగస్వామి, రాజంపేట ఆర్డిఓ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement