Friday, November 22, 2024

టీఎస్‌ ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు చర్యలేవీ? వరుస డ్యూటీలతో డ్రైవర్లపై ఒత్తిడి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. సురక్షితమైన ప్రయాణానికి టీఎస్‌ ఆర్టీసీనే ఎంచుకోండి అని ఆ శాఖ చేసే ప్రచారం ఉత్త మాటేనా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థలో సుశిక్షితులైన డ్రైవర్లు ఉండి కూడా రాష్ట్రంలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం కలవరపెడుతోంది. గత రెండు నెలలుగా రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా బస్సులు నడుపుతున్న, ప్రమాదాలకు కారణమవుతున్న డ్రైవర్లపై ప్రత్యేక నిఘా ఉంచేవారు. ఇలాంటి డ్రైవర్లను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రత్యేక సూచనలు చేయడంతో పాటు వారికి తగిన శిక్షణ ఇచ్చేవారు. అయితే, టీఎస్‌ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించే దిశగా ఉన్నతాధికారుల గత కొంత కాలంగా కేవలం ఆదాయం పెంచుకునే మార్గాలపైనే దృష్టి సారించడంతో ఈ పరిస్థతి తలెత్తింది. డ్రైవర్ల డ్యూటీల విషయంలో చోటు చేసుకుంటున్న మార్పులు వారిలో ఒత్తిడిని పెంచుతున్నాయి. డ్రైవర్లకు సిబ్బంది కొరత పేరుతో వీక్‌ ఆఫ్‌లు లేకపోవడం, వరుస డ్యూటీలు వేయడంతో శారీరకంగా అలసిపోవడం బస్సు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇటీవల వరంగల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలకు ఇదే కారణమని సంస్థ అధికారులు గుర్తించారు.

బస్సు ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ డబుల్‌ డ్యూటీ చేసి విశ్రాంతి లేకుండా మరో డ్యూటీకి వచ్చినట్లు విచారణలో తేలింది. కాగా, ఆర్టీసీలో గత కొంత కాలంగా డ్రైవర్ల నియామకాలు చేపట్టలేదు. చివరిసారిగా పన్నెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన వారే ప్రస్తుతం కొనసాగుతున్నారు. కొత్త డ్రైవర్ల నియామకంపై టీఎస్‌ ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. కొంత మంది సీనియర్‌ డ్రైవర్లకు అనారోగ్య కారణాలు, త్వరగా అలసిపోవడం, నిద్రను నియంత్రించుకోలేక పోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. డ్యూటీ, డ్యూటీకి మధ్య ఉండాల్సిన విరామం సరిగా పాటించలేదనీ, వరుస డ్యూటీలతో అలసిపోయే డ్రైవర్లు ఏమరుపాటుగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నారనే వాదనలు ఉన్నాయి. గతంలో డ్రైవర్లకు బస్సు ప్రమాదాల నివారణకు తరచూ ప్రత్యేక శిక్షణ ఇచ్చే వారు. వయసు పై బడిన డ్రైవర్లకు సాధ్యమైనన్ని తక్కువ ట్రిప్పులు ఇచ్చే వారనీ, అవసరాన్ని బట్టి సెలవులు కూడా మంజూరు చేసే వారనీ దీంతో విశ్రాంతి తీసుకుని తిరిగి విధులకు హాజరైతే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని పలువురు డ్రైవర్లు పేర్కొంటున్నారు.

డ్రైవర్లకు రిటైర్మెంట్‌ వయసు 60కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. 60 ఏళ్ల వయసులో డ్రైవర్లకు కంటి చూపు సరిగా ఉండదనీ, ఒకవేళ స్వచ్చంద పదవీ విరమణ తీసుకుందామంటే ఏడాది సర్వీసుకు గాను కేవలం ఒక్క నెల వేతనం మాత్రమే ఇస్తున్నారనీ, అందుకే తప్పని పరిస్థితుల్లో విధుల్లో కొనసాగుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా చలికాలం కారణంగా టీఎస్‌ ఆర్టీసీ డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు జారీ చేసింది. పొగ మంచు ఉన్నప్పుడు వేగాన్ని నియంత్రించుకోవడం, ఎదుటి వాహనాలను గమనిస్తూ ఉండటం, ఓవర్‌ టేకింగ్స్‌తో జాగ్రత్తలు, మంచు లైట్లు, ఇండికేటర్లు, వైపర్ల వినియోగం, అవసరమైతే రోడ్డు పక్కన ఆపేసి మంచు తగ్గాక వెళ్లడం, డ్రైవర్లు విధిగా అర్ధరాత్రి తెల్లవారు జామున నిద్ర పోయేలా నీటితో మొహం కడుక్కోవడం డ్యూటీకి వచ్చే ముందు సరైన విశ్రాంతి తీసుకోవడం వంటి అంశాలపై తగిన సూచనలు చేసింది. ఈ చర్యలు పాటిస్తే బస్సు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని ఆర్టీసీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement