Monday, November 18, 2024

ఇంజనీరింగ్‌ ఫీజులపై నిర్ణయమేదీ? ఇంకా నిర్ణయం తీసుకోని సర్కార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నా ఇంకా ఇంత వరకూ ఇంజనీరింగ్‌ ఫీజులు ఖరారు కాలేదు. ఫీజుల విషయంలో ప్రభుత్వం నాన్చుడు ధోరణీ అవలంభిస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ మొదటి విడత స్లాట్‌ బుకింగ్‌ గడువు గురువారంతో ముగియగా, ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. నాలుగైదు రోజుల్లో మొదటి విడత సీట్లను కూడా కేటాయించనున్న నేపథ్యంలో ఇంత వరకూ ఇంజనీరింగ్‌ ఫీజులు ఇంకా ఖరారు కాకపోవడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో కాలేజీలో ఫీజులు ఒక్కోలా ఉంటాయి. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుందనే విషయం తెలిస్తే దానికనుగుణంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌లో పాల్గొని సీటు పొందే వీలుందటుంది. అలా కాకుండా కాలేజీలు తమకు నచ్చిన ఫీజులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ) మాత్రం ఈ ఏడాదికి గతేడాది ఫీజులనే అమలు చేస్తున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయాన్ని చాలా కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. కరోనా పరిస్థితులను చూపి గతేడాది ఫీజులనే ఈ విద్యాసంవత్సరానికీ వసూలు చేయాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాయి. ఫీజులను పెంచి కొత్త ఫీజులను ఖరారు చేయాల్సిందిపోయి పాత ఫీజులను అమలు చేయాలనడమేంటని పలు కాలేజీల యాజమాన్యాలు నిలదీస్తున్నాయి. ఇదే విషయాన్ని గత నెలలో టీఎఎఫ్‌ఆర్‌సీని కలిసి విజ్ఞప్తి కూడా చేశాయి. 2021-22 ఏడాదితో 2019 బ్లాక్‌ పిరియడ్‌లో ఖరారు చేసిన ఫీజుల గడువు ముగియడంతో 2022-23 నుంచి 2024-25 విద్యా సంవత్సరం వరకు కొత్త బ్లాక్‌ పిరియడ్‌కు సంబంధించిన ఫీజులను ఖరారు చేస్తూ టీఏఎఫ్‌ఆర్‌సీ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త ఫీజులు అమలులోకి వస్తాయని అంతా అనుకున్నారు. కానీ కరోనా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఒక్క ఏడాదికి పాత ఫీజులనే అమలు చేయాలనే ప్రతిపాదనను టీఏఎఫ్‌ఆర్‌సీ హఠాత్తుగా ముందుకు తీసుకొచ్చింది. దీనిపై ఇప్పటికే 14 వరకు కాలేజీలు కోర్టుకు పోయి కొత్త ఫీజులను ఖరారు చేసుకున్నాయి. అయితే మిగిలిన కాలేజీల ఫీజుల అంశంపై స్పష్టత కరువైంది. ఈ క్రమంలోనే కొత్త, పాత ఫీజుల అంశానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రెభుత్వానికి టీఏఎఫ్‌ఆర్‌సీ అందజేసింది. అయితే ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించిన జీవో ఎప్పుడు విడుదలౌతుందోనని టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు సైతం ఎదురు చూడడం తమవంతైంది. కొత్త ఫీజులు ఉంటాయా? లేక పాత ఫీజులే అమలు అవుతాయా? అనే దానిపై స్పష్టత కరువవడంతో అటు విద్యార్థులు, ఇటు కాలేజీలు గందరగోళంలో ఉన్నాయి.

ధ్రువపత్రాల పరిశీలన నేటితో లాస్ట్‌..

ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఈ రోజుతో ముగియనుంది. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు 3వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇప్పటి వరకు సుమారు 75 వేల మంది వరకు విద్యార్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. ఈనెల 6న మొదటి విడత ఎంసెట్‌ సీట్లను కేటాయించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement