దిసనాయకేదూకుడు! ఆయనదే అధ్యక్ష పీఠం
ప్రత్యర్థులకు అందనంత దూరంలో
ఫలితాల్లో ఎక్కడా తగ్గని నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీ
రెండో స్థానంలో ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస
మూడో స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే
ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్:శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) పార్టీ నాయకుడు అనుర కుమార దిసనాయకే భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
ఆయనే కనుక విజయం సాధిస్తే తొలి వామపక్ష దేశాధినేతగా రికార్డులకెక్కుతారు. ప్రస్తుతం ఉన్న లీడ్స్ ఇలాగే కొనసాగితే దిస్సనాయకే శ్రీలంక 9వ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు
ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో జనతా విముక్తి పేరమున పార్టీకి చెందిన మార్క్సిస్ట్ నేత, అనుర కుమార దిస్సనాయకే 7,27,000 (52 శాతం) ఓట్లను సాధించారు. ఆ తర్వాత 11 గంటల వరకు కూడా అదే స్థాయిలో దూసుకుపోయారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించిన ఫలితాల్లోనూ దిసనాయకే దూకుడు చూపారు.
ఇక.. సమగి జన బలవేగయ (ఎస్జేబీ) పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస 3,33,000 (23 శాతం) ఓట్లను పొందారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమ సింఘే 2,35,000 (16 శాతం) ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. అలాగే 22 పోస్టల్ జిల్లాల ఓట్లలో 21 దిసనాయకే గెలుచుకున్నారు.
ఫలితాలపై స్పందించని విక్రమసింఘే..
కాగా, అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని ఇంకా రణిల్ విక్రమసింఘే అంగీకరించలేదు. అయితే ఆయన ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ మాత్రం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆధిక్యంలో దూసుకెళ్తున్న అనుర కుమార దిసనాయకేను అభినందించారు.
“సుదీర్ఘమైన ఎన్నికల ప్రచారం తర్వాత ఫలితాలు స్పష్టంగా వచ్చాయి. నేను అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే కోసం భారీగా ప్రచారం చేశాను. శ్రీలంక ప్రజలు అనుర కుమార దిసానాయకేకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును నేను పూర్తిగా గౌరవిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. దిసనాయకే, అతని బృందానికి నా హృదయపూర్వక అభినందనలు” అని ఎక్స్లో అలీ సబ్రీ పోస్టు చేశారు.
మరోవైపు, ప్రతిపక్ష నేత ప్రేమదాస పార్టీకి చెందిన హర్ష డిసిల్వా కూడా దిసనాయకేను అభినందించారు.భారీగా పుంజుకున్న దిసనాయకేఅధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సాధించిన ఫలితం ఊహించని స్థాయిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో దిసనాయకేకు 3 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ క్రమంలో దేశంలో అవినీతిని రూపుమాపుతానని ఈ ఎన్నికల్లో దిసనాయకే హామీ ఇచ్చారు. దీంతో ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపారు.
తగ్గిన పోలింగ్ శాతం
శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు శనివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ నమోదైంది. 2019లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 83 శాతం ఓటింగ్ జరిగింది. అప్పటితో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ఆధారంగా శ్రీలంక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తాయో వారే తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోతే, రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు.