ఏపీలో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న 79 శాతం మందిలో యాంటీబాడీలు అభివృద్ధి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన నాలుగో సీరో సర్వేలో తేలింది. టీకాలు తీసుకోని 59.5 శాతం మందిలోనూ యాంటీబాడీలు పెరిగినట్టు వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 63.5 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 56.38 శాతంగా ఉంది. ఇక టీకాలు రెండు డోసులు తీసుకున్న వారిలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, అంగన్వాడీ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ ఉద్యోగులు ఉన్నారు.
వైరస్ ప్రభావం ఎలా ఉంది? ప్రజల్లో యాంటీబాడీలు వృద్ది చెందుతున్నాయా? వంటి అంశాలపై సీరో తాజా సర్వే దృష్టి పెట్టింది. ఏప్రిల్ 9 నుంచి 16వ తేదీ మధ్య ఒక్కో జిల్లాలో 4,200 మంది చొప్పున మొత్తం 54,600 మంది నుంచి నమూనాలు సేకరించింది. ఇందులో కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారు, అస్సలు టీకానే తీసుకోని వారు కూడా ఉన్నారు. రెండు డోసులు పొందిన వారిలో 7,800 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. వీరిలో 79 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు ఫలితాల్లో తేలింది. టీకాలు అస్సలు తీసుకోని 46,800 నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా 59.5 శాతం మందిలో యాంటీ బాడీలు వృద్ధి చెందినట్టు తేలింది.