భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దుబాయ్‌లో మరొక విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీని ఖరీదు 163 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1353 కోట్లు) అని, దుబాయ్‌లో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద ప్రాపర్టీ డీల్ అని మార్కెట్‌వర్గాలు చెప్పుకుంటున్నాయి. నిర్దిష్టంగా ముఖేశ్అంబానీ ఈ విల్లాను కొన్నట్లు అధికారిక ప్రకటన రాలేదు. 163 మిలియన్ డాలర్ల ప్రాపర్టీ డీల్ గురించి దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ గతవారం పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. పామ్ జుమైరా ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రాపర్టీ డీల్ ఎవరి పేరుతో జరిగిందన్న విషయం మాత్రం బహిర్గతం కాలేదు.
కువైట్‌కు చెందిన సంపన్నడు మహ్మద్ ఆల్షాయా నుంచి అంబానీ దీన్ని కొన్నట్లు సమాచారం. కాగా, ముఖేశ్ అంబానీకి ఇదివరకే దుబాయ్‌లోని పామ్ జుమైరా ప్రాంతంలో ఖరీదైన విల్లా ఉన్నది. దీన్ని రూ.643 కోట్లకు కొనుగోలు చేశారు. పామ్ జుమైరా కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయం. ముఖేశ్ అంబానీ ఇటీవల విదేశాల్లో ఆస్తుల కొనుగోలుపై దృష్టిసారించాడు. సింగపూర్‌లో కుటుంబ కార్యాలయం కోసం సన్నాహాలు ప్రారంభించారని తెలుస్తున్నది. గతేడాది బ్రిటన్‌లో ఓ విశాల సౌధాన్ని కొనుగోలు చేశారు. బకింగ్‌హాం షైర్ వద్ద ఉన్న 300 ఎకరాల్లోని స్టోక్‌పార్క్‌ను రూ.592 కోట్లకు కొన్నారు. దీన్ని పెద్దకుమారుడు ఆకాశ్ కోసం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈఏడాది జనవరిలో మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్‌లోనూ 73.4శాతం వాటాలను కొన్నారు. ప్రస్తుతం ముఖేశ్ కుటుంబం ముంబైలో నివశిస్తోంది. వారి నివాస భవనం పేరు యాంటిలియా. 27 అంతస్తుల ఈ భవనంలో మూడు హెలిపాడ్లు, 168 కార్ల పార్కింగ్, 50 మందికి సరిపోయే మినీ థియేటర్, 9 ఎలివేటర్లు సహా అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి.