రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆత్మహత్యలకు అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. జేఈఈకి సిద్ధమవుతోన్న మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఏడాదిలో ఇది నాలుగో మరణం. విద్యార్థుల వరుస ఆత్మహత్యలు అందరినీ కలవరపెడుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం… ఝార్ఖండ్‌కు చెందిన శుభ్ చౌధరీ రెండేళ్లుగా జేఈఈకి సిద్ధమవుతున్నాడు. మంగళవారం జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చాయి. ఈ పరీక్షలో శుభ్ అంచనాకు తగ్గట్టుగా మార్కులు సాధించలేకపోయాడు. ఫలితాలు చూసుకున్న తర్వాత తన గదికి వెళ్ళాడు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారు వార్డెన్‌ను సంప్రదించారు. వార్డెన్ వెళ్లేసరికి సీలింగ్‌కు ఉరేసుకొని అతడు వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహంను స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.