కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు దేశంలోని వివిధ నగరాల మధ్య సేవలందిస్తున్నాయి. కాగా, రానున్న రోజుల్లో మరిన్ని రూట్లకు చైర్‌కార్, స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీస్‌లను విస్తరించాలని కేంద్రంలోని ప్రధాని మోదీ సర్కార్ యోచిస్తోంది.
ఇక, సెప్టెంబర్ 24న మరో తొమ్మిది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలపైకి తీసుకొచ్చేందుకు ముహూర్తం ఖరారు చేసింది. పూరీ- రూర్కెలా, కాసర్‌గోడ్- త్రివేండ్రం, ఉదయపూర్- జైపూర్, రాంచీ-హౌరా, తిరునెల్వేలి- చెన్నై, పాట్నా-హౌరా, హైదరాబాద్- బెంగళూరు, జామ్‌నగర్- అహ్మదాబాద్, విజయవాడ- చెన్నై రూట్లలో ఈ కొత్త వందే భారత్ ట్రైన్లు సేవలందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక హైదరాబాద్ – బెంగళూరుల మధ్య ప్రారంభం కానున్న వందే భారత్ రైలు కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్‌కు మధ్య తిరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈనెల 24వ తేదీన 12.30 గంటలకు ప్రారంభిస్తారు.
ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటలకు వందేభారత్ రైలు యశ్వంత్ పూర్‌కు చేరుకుంటుంది. మధ్యలో మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్లలోనే ఆగుతుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంత్‌పూర్ లోబయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచికూడ చేరుకుంటుంది. ఈ నెల 24న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో మొత్తం తొమ్మిది వందేభారత్ రైళ్లను ఒకేసారి ప్రారంభించనున్నారు.