హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. కాచిగూడ-యశ్వంతాపూర్ మధ్య నడిచే ఈ రైలును ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాగా, ఈ రైలు తెలుగు రాష్ట్రాలలో నడిచే మూడో వందే భారత్ రైలు కావడం విశేషం. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి ప్రారంభమై ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా డోన్ మీదుగా బెంగుళూరు సమీపంలోని యశ్వంతపూర్‌కు ఈ రైలు చేరుకుంటుంది.
దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే ఈ మార్గంలో నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ ట్రయల్ రన్‌లో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయం 6-30 గంటలకు డోన్‌లో బయలుదేరి 10-30కు కాచిగూడ చేరుకుంది. ప్రస్తుతం కాచిగూడ స్టేషన్‌లోని ప్లాట్ ఫాం-5పై ఈ రైలును నిలిపి ఉంచారు. కాచిగూడ-యశ్వంతాపూర్ మధ్య వందేభారత్ రైలు అందుబాటులోకి రానుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలుగనుంది.
దక్షిణ భారత దేశ ప్రధాన నగరాలైన హైదరాబాద్-బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగనుంది.ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగే స్టేషన్లు, టికెట్ ధరల వివరాలను ద.మ.రైల్వే అతి త్వరలో ప్రకటించనుంది. తొలి రోజు ఆయా స్టేషన్లలో ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఆగస్టు 7 నుంచి ఈ రైలు నిరంతరాయంగా సేవలు అందించనుంది. కాగా, ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్టణం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
అంతేకాకుండా, ద.మ.రైల్వే నివేదిక ప్రకారం……ఈ రెండు రూట్లలో వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీ కూడా బాగుంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య ప్రతీ రోజు వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో ప్రవేశపెట్టనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని రైల్వే వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఆగస్టు 6న కాచిగూడ-యశ్వంతాపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభంతో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పనులలో భాగంగా మల్కాజ్‌గిరి, నిజామాబాద్, ఉప్పుగూడ, కామారెడ్డి, మలక్‌పేట, మహబూబ్‌నగర్ కర్నూల్ స్టేషన్లలో అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని ద.మ.రైల్వే అధికారులు వెల్లడించారు.